
Kohli - Babar: టీ20ల్లో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్
మలింగను అధిగమించిన రషీద్ ఖాన్
దుబాయ్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో తలపడిన సందర్భంగా పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-2లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందిన ఆ జట్టు సెమీస్‌కు మరింత చేరువైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో పాక్ జట్టు సెమీస్ చేరడంపై మరింత నమ్మకంగా ఉంది.
ఇక గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 147/6 స్కోర్ చేసింది. కెప్టెన్ మహ్మద్ నబి (35*; 32 బంతుల్లో 5x4), గుల్బాడిన్ (35*; 25 బంతుల్లో 4x4, 1x6) చివర్లో ధాటిగా ఆడి పాక్ ముందు పోరాడే స్కోర్ నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అసిఫ్ అలీ (25*; 7 బంతుల్లో 4x6) ఆఖర్లో సిక్సర్లతో విరుచుకుపడి అద్భుత విజయం అందించాడు. అంతకుముందు బాబర్ అజామ్ (51; 47 బంతుల్లో 4x4) అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడు పొట్టి క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది అతడికి 26వ ఇన్నింగ్స్ కావడం విశేషం. కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డుకు చేరుకున్నాడు. దీంతో పాక్ కెప్టెన్ టీమ్ఇండియా సారథి రికార్డును బద్దలుకొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫా డుప్లెసిస్ (31), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32), న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (36) ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు.
మరోవైపు అఫ్గాన్ స్పిన్ స్పెషలిస్టు రషీద్‌ఖాన్ సైతం టీ20ల్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అతడు.. బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్ (10)లను ఔట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రషీద్ 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు చేరుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82), బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (83) ఇన్నింగ్స్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మరోవైపు రషీద్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇదివరకు రికార్డు నెలకొల్పాడు. 2018లో అతడు 44 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అందరి కన్నా తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ అఫ్గాన్ స్పిన్నర్ ప్రత్యేకత సాధించాడు.