IND vs PAK: టీమ్‌ఇండియాతో పాకిస్థాన్‌ ఓడితే అంతే: బ్రాడ్‌హాగ్

టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ దాయాది జట్ల మధ్య మరో రసవత్తర పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ ప్రేమికులంతా...

Published : 22 Oct 2021 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం దాయాది జట్లు టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మరో రసవత్తర పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు రాణించడంతో పాటు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరోవైపు ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియాదే పూర్తి ఆధిపత్యం కలిగిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లోనూ కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్‌-2లో మిగతా జట్లను ఓడించి భారత్‌ సెమీఫైనల్స్‌ చేరుతుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ అభిప్రాయపడ్డాడు.

ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా యూట్యూబ్‌ ఛానల్‌లో బ్రాడ్‌హాగ్‌ను అడగ్గా.. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ పేర్లను, గ్రూప్‌-2 నుంచి భారత్‌, పాకిస్థాన్‌ పేర్లను పేర్కొన్నాడు. అయితే, తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీమ్‌ఇండియా చేతిలో ఓటమిపాలైతే తర్వాత న్యూజిలాండ్‌పై గెలవాల్సి ఉంటుందన్నాడు. ఆ మ్యాచే దాయాది జట్టు సెమీస్‌కు చేరుతుందా లేదా అనేది నిర్ణయిస్తుందని తెలిపాడు. టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో ఆధిపత్యం చలాయిస్తే పాక్‌ తర్వాతి మ్యాచ్‌ల్లో రాణించడం కష్టమని హాగ్‌ వివరించాడు. కాగా, గ్రూప్‌-2లో ఉన్న భారత్‌, పాక్‌ జట్లు సూపర్‌-12 దశలో న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌తో పాటు గ్రూప్‌-ఏ రన్నరప్‌, గ్రూప్‌-బి విజేతలతో మిగతా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ఈ గ్రూప్‌లో టీమ్‌ఇండియా బలంగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని