
T20 World cup: ఆస్ట్రేలియా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు: విలియమ్సన్
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన తుదిపోరులో కంగారూలు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘మేం గెలవడానికి ప్రయత్నాలు చేసినా పిచ్ సహకరించలేదు. ఈ దుబాయ్ పిచ్ కాస్త కఠినంగా ఉంది. మేం పలు భాగస్వామ్యాలు నిర్మించి పోరాడేందుకు కావాలిసినంత లక్ష్యాన్ని నిర్దేశించడం బాగుంది. కానీ, ఆస్ట్రేలియా దాన్ని సునాయాసంగా ఛేదించింది. అదో అద్భుతమైన జట్టు. ఈ క్రమంలోనే మేం గెలుపొందడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
‘మా ఆటగాళ్లు కచ్చితమైన ప్రణాళికలతో వచ్చి ఆడినా ఆస్ట్రేలియా ప్లేయర్లు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే, మా జట్టు అంకితభావం పట్ల నేను గర్వపడుతున్నా. తుదిపోరు వరకూ వచ్చి మా అత్యుత్తమ ప్రదర్శన చేసినా సరిపోలేదు. యూఏఈలో ఒక పిచ్‌తో మరో పిచ్‌కు పోలికే లేదు. అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకుసాగాం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు క్రెడిట్ దక్కుతుంది. ఈరోజు వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఫైనల్‌కు చేరేసరికి మాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమే. అందులో ఏదైనా జరగొచ్చు’ అని న్యూజిలాండ్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు.
అతిపెద్ద విజయం..గర్వంగా ఉంది: ఆరోన్ ఫించ్
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ జట్టు తరఫున తొలి టీ20 ప్రపంచకప్ అందుకోవడం కెప్టెన్‌గా గర్వంగా ఉందన్నాడు. ‘ఇది అతిపెద్ద విజయం. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా నిలవడం అద్భుతంగా ఉంది. మా జట్టులో పలువురు అత్యద్భుత వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. మరికొన్ని మ్యాచ్‌ల్లో జట్టుగా రాణించాం. వార్నర్ పని అయిపోయిందని చాలా మంది విమర్శలు చేశారు. అలాంటప్పుడే అతడు మరింత బాగా ఆడతాడు. నా మటుకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అంటే ఆడం జంపా. ఇక మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అమోఘం. వేడ్, స్టోయినిస్ కూడా ఈ టోర్నీలో బాగా ఆడారు’ అని ఫించ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.