IND vs PAK: ఇది టీమ్‌ఇండియాకు అత్యంత ఘోర పరాభవం: గావస్కర్

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలవ్వడంపై దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు...

Published : 26 Oct 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలవ్వడంపై దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు. మ్యాచ్‌ అనంతరం జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. ఇది భారత జట్టుకు అత్యంత ఘోర పరాభవమని చెప్పాడు. అయితే, రాబోయే మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా పుంజుకుంటుందని, ప్రపంచకప్‌లో మిగతా జట్లను ఓడించి ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై ఆడాల్సిన మ్యాచ్‌ల మీద దృష్టిసారించాలని సూచించాడు.

మరోవైపు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఈ ఓటమిపై ట్విటర్‌ వేదికగా స్పందించాడు. పాకిస్థాన్‌ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో శుభారంభం చేసిందన్నాడు. అలాగే టీమ్‌ఇండియా ఈ ఓటమి నుంచి బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం పాకిస్థాన్‌ను అభినందిస్తూనే టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో టీమ్‌ఇండియాతో వరుస ఓటములను దాటడానికి పాకిస్థాన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసిందని, షహీన్‌ అఫ్రిది ఆదిలోనే రెండు వికెట్లు తీసి పాక్‌ను ఆధిపత్యంలో నిలబెట్టాడని వీవీఎస్‌ ప్రశంసించాడు. అలాగే ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు బాబర్‌, రిజ్వాన్‌ అత్యద్భుతంగా ఆడారన్నాడు. ఇకపై టీమ్‌ఇండియా చేయాల్సింది చాలా ఉందని, అయితే.. బలంగా పుంజుకునే శక్తి కోహ్లీసేనకు ఉందని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని