T20 World Cup: అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దు: భజ్జీ

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్‌ ఫైనల్లా చూడొద్దని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు...

Updated : 16 Nov 2021 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్‌ ఫైనల్లా చూడొద్దని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. కోహ్లీసేన సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌ భారత జట్టుకు క్వార్టర్‌ ఫైనల్‌ వంటిదని అభిమానులు భావిస్తున్నారు. దాన్ని అలా భావించొద్దని.. ఈ గ్రూప్‌లో అఫ్గానిస్థాన్‌ కూడా ప్రమాదకరమైన జట్టేనని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆ జట్టు స్కాట్లాండ్‌ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయాన్ని గుర్తుచేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు గ్రూప్‌-2లో పాకిస్థాన్‌ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టైటిల్‌ రేసులో ఫేవరెట్‌గా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం టీమ్‌ఇండియాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు మంగళవారం న్యూజిలాండ్‌పైనా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ గ్రూప్‌ పాయింట్ల పట్టికలో పైనుంది. ఈ క్రమంలోనే మిగిలిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు.. అఫ్గాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాలను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే గ్రూప్‌ నుంచి రెండో జట్టుగా సెమీస్‌లో అర్హత సాధించేందుకు టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ ప్రధానంగా పోటీపడుతున్నాయి. దీంతో ఈనెల 31న జరగనున్న మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇందులో ఓడిన జట్టు సెమీస్‌కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ జట్టు గెలిచినా తన తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టీమ్‌ఇండియాకు ఇది క్వార్టర్‌ ఫైనల్‌ కాదని హర్భజన్‌ అభిప్రాయపడ్డాడు.

‘న్యూజిలాండ్‌తో పోరు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటిది కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్‌. అయితే, అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే.. ఏ టీమ్‌నైనా ఓడించగలదు. ఇక టీమ్‌ఇండియా సెమీస్‌ చేరాలంటే తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్‌ను ఓడించడం. మన ఆటగాళ్లపై నాకా నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైందే. అందుకోసం కోహ్లీసేన సిద్ధంగా ఉందని బలంగా నమ్ముతున్నా. కచ్చితంగా గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్‌ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్‌తో తలపడిన రోజు మనదికాదు’ అని హర్భజన్‌ అన్నాడు. దాయాది జట్టుతో ఓటమి టీమ్‌ఇండియాకు మేలుకొలుపు లాంటిదని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని