T20 World Cup: ఇషాన్‌ ఓపెనింగ్‌ చేస్తే.. పవర్‌ప్లేలో 60-70 పరుగులు: భజ్జీ

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుందని, అతడు పవర్‌ప్లేలో 60-70 పరుగులు సాధిస్తాడని వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు...

Published : 29 Oct 2021 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోహిత్‌ శర్మతో కలిసి టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుందని, అతడు పవర్‌ప్లేలో 60-70 పరుగులు సాధిస్తాడని వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన భజ్జీ చాలా విషయాలపై స్పందించాడు. ఇషాన్‌ కచ్చితంగా ఆడాలని, అది జట్టుకెంతో ముఖ్యమని చెప్పాడు. ఈ యువ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌తో కలిసి బరిలోకి దిగితే టీమ్ఇండియాకు అవసరమైన శుభారంభం చేస్తాడన్నాడు. అతడు ఆడితే పవర్‌ప్లేలో భారత్‌ స్కోర్‌ 60-70 పరుగులుగా నమోదవుతుందని అంచనా వేశాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుందని తెలిపాడు.

అలాగే రోహిత్‌తో కలిసి ఇషాన్‌ ఓపెనింగ్‌ చేస్తే తర్వాత కోహ్లీ, రాహుల్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌కు రావాలని భజ్జీ సూచించాడు. పాండ్య ఆరో స్థానంలో ఉంటూ బ్యాటింగ్‌ చేయాలని.. తనదైన రోజు ఏ బౌలర్‌నైనా చితకబాదుతాడని చెప్పాడు. అతడు బౌలింగ్‌ చేయకపోయినా తుది జట్టులో ఉండాలన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ చేయడం, మూడో స్థానంలో ఆడటం లాంటివి తేలికని, అదే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయడం కష్టమని అన్నాడు. అక్కడ తొలి బంతి నుంచే దంచికొట్టాలన్నాడు. అందుకు ఆటమీద మంచి అవగాహన ఉండాలన్నాడు. అది హార్దిక్‌కు మెండుగా ఉందన్నాడు. అనంతరం లోయర్‌ ఆర్డర్‌పై స్పందించిన హర్భజన్‌.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో శార్దూల్‌ ఠాకూర్‌, తొమ్మిదిలో బుమ్రా, పదో స్థానంలో షమి పేర్లు చెప్పాడు. అలాగే చివరగా తన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహచరుడు వరుణ్‌ చక్రవర్తి పేరు వెల్లడించాడు. అతడు చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడని.. కుదురుకోవడానికి సమయం పడుతుందని హర్భజన్‌ అన్నాడు. త్వరలోనే అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోతారన్నాడు. అతడు గొప్ప మ్యాచ్‌ విన్నర్‌ అవుతాడన్నాడు. టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని వెటరన్‌ క్రికెటర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని