Updated : 16 Nov 2021 15:32 IST

IND vs NZ: భారత్‌పై కివీస్‌దే ఆధిపత్యం.. కోహ్లీసేన 18 ఏళ్ల రికార్డు తిరగరాయాలి..!

ఐసీసీ ట్రోఫీల్లో షాకిస్తున్న న్యూజిలాండ్‌

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 world cup 2021)లో ఆదివారం కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండు జట్లూ  పాకిస్థాన్‌తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్‌ఇండియాకు షాకిస్తున్న న్యూజిలాండ్‌ ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీంతో తన రికార్డును మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు టీమ్‌ఇండియా 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి గంగూలీ నేతృత్వంలో కివీస్‌ను ఓడించగా.. ఆ తర్వాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. మెగా టోర్నీల్లో భారత్‌ అన్ని ప్రధాన జట్లను మట్టికరిపించినా కివీస్‌ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ కోహ్లీసేన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ ఆధిపత్యం ఎలా సాగిందో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..

దాదా శతకం వృథా..

2000 ఏడాది ఐసీసీ నాకౌట్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌ తొలిసారి షాకిచ్చింది. సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని జట్టును స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ టీమ్‌ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్‌ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత సచిన్‌ ఔటయ్యాక రాహుల్‌ ద్రవిడ్ ‌(22), యువరాజ్‌ సింగ్ ‌(18), వినోద్‌ కాంబ్లీ (1), రాబిన్‌సింగ్ ‌(13), అజిత్‌ అగార్కర్‌ (15) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో టీమ్‌ఇండియా చివరికి 50 ఓవర్లలో 264/6 స్కోర్‌ చేసింది. ఛేదనలో కివీస్‌ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్రిస్‌కేర్న్స్ ‌(102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో మెరవగా క్రిస్‌ హారిస్ ‌(46; 72 బంతుల్లో 4x4) సహకరించాడు. దీంతో న్యూజిలాండ్‌ రెండు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది.

కైఫ్‌, ద్రవిడ్‌ గెలిపించారు..

ఆపై 2003 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో తలపడి విజయం సాధించింది. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నేతృత్వంలోని కివీస్‌ను భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కట్టడి చేసింది. జహీర్‌ఖాన్‌ 4/42 విజృంభించడంతో పాటు మిగతా బౌలర్లు తలా ఓ చేయి వేయడంతో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. ఫ్లెమింగ్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా తడబడింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (1), సచిన్‌ తెందూల్కర్‌ (15), కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (3) పూర్తిగా విఫలమయ్యారు. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచిన జట్టును మహ్మద్‌ కైఫ్‌ (68; 129 బంతుల్లో 8x4), రాహుల్‌ ద్రవిడ్‌ (53; 89 బంతుల్లో 7x4) ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా చివరివరకూ క్రీజులో నిలబడి అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 10 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

వీరూ, గౌతీ రాణించినా స్వల్ప తేడాతో ఓటమి..

అనంతరం 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, గ్రూప్‌ స్టేజ్‌లో ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా డేనియల్‌ వెటోరీ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ చేతిలో 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (45; 31 బంతుల్లో 9x4), క్రేగ్‌ మెక్‌మిలన్‌ (44; 23 బంతుల్లో 1x4, 4x6), జాకబ్‌ ఓరమ్‌ (35; 15 బంతుల్లో 2x4, 3x6) దంచికొట్టారు. ఆపై లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్‌ (51; 33 బంతుల్లో 5x4, 2x6), వీరేంద్ర సెహ్వాగ్‌ (40; 17 బంతుల్లో 6x4, 2x4) రెచ్చిపోయారు. తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌ ధోనీ (24), యువరాజ్‌ (5), దినేశ్ కార్తీక్‌ (17) విఫలమవడంతో జట్టు ఓటమిపాలైంది. చివర్లో శ్రీశాంత్‌ (19*; 10 బంతుల్లో 4x4) బౌండరీలతో చెలరేగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్‌..

ఇక 2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు గ్రూప్‌-2లో పదమూడో మ్యాచ్‌లో తలపడ్డాయి. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేన్‌ విలియమ్సన్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దాంతో భారత్‌ సునాయాస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ధోనీసేన ఛేదనలో మరింత దారుణంగా ఆడి టీ20ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లు అశ్విన్‌, నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా కట్టుదిట్టంగా బంతులేసి తలా ఓ వికెట్‌ తీసి కివీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. ఆ జట్టులో కొరే అండర్సన్‌ (34; 42 బంతుల్లో 3x4), లుక్‌ రోంచి (21; 11 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ (23; 27 బంతుల్లో 2x4), ధోనీ (30; 30 బంతుల్లో 1x4, 1x6) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో చివరికి 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ శాంట్నర్‌ 4/11 కెరీర్‌లోనే గొప్ప గణాంకాలు నమోదు చేశాడు.

ధోనీ రనౌటై.. నిరాశపర్చాడు..

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ భారత అభిమానులెవ్వరూ అంత తేలిగ్గా మర్చిపోరు. ఎందుకంటే అది టీమ్‌ఇండియా ఆటగాడిగా ధోనీకి చివరి మ్యాచ్‌. అప్పుడు కూడా న్యూజిలాండ్‌తోనే తలపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులే చేసింది. రాస్‌టేలర్‌ (74; 90 బంతుల్లో 3x4, 1x6), కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్‌ అందించారు. కానీ, ఆరోజు వర్షం కురవడంతో ఆట మరుసటి రోజుకు వాయిదా పడింది. ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా చేతులేత్తేసింది. కేఎల్‌ రాహుల్ ‌(1), రోహిత్‌ శర్మ (1), కోహ్లీ (1) దినేశ్‌ కార్తీక్ ‌(6) విఫలమయ్యారు. మధ్యలో పంత్ (32), హార్దిక్‌ పాండ్య (32) ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అప్పుడే రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) అద్భుతంగా ఆడి మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అయితే, చివర్లో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోగా స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ముఖ్యంగా ధోనీ అర్ధశతకం పూర్తయ్యాక రనౌట్ అవ్వడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఓటములే..

మరోవైపు గతేడాది 2020 న్యూజిలాండ్‌ పర్యటనలోనూ టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కేన్‌ విలియమ్సన్‌ జట్టుతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అన్ని జట్లపై ఆధిపత్యం చలాయించిన భారత్‌.. కివీస్‌తో మాత్రం గెలవలేకపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ న్యూజిలాండ్‌ కోహ్లీసేనకు మరోసారి షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగా కివీస్‌ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 170 పరుగులకే ఆలౌటవ్వడంతో న్యూజిలాండ్‌ 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో గత రెండు దశాబ్దాలుగా న్యూజిలాండ్‌ ఎప్పుడూ భారత్‌కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో కోహ్లీసేన తలపడుతుండటంతో ఇప్పుడైనా విజయం సాధించి 18 ఏళ్ల రికార్డును తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని