Spirit of Cricket: కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి.. భారత్‌ - పాక్‌ జట్లపై ఐసీసీ హర్షం..!

క్రీడాస్ఫూర్తి.. ఈ మాట ఇటీవలి కాలంలో చాలాసార్లు వింటున్నాం. ఏ ఆటలోనైనా ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అందుకు టీమ్‌ఇండియా, పాక్‌ ఆటగాళ్లు కూడా మినహాయింపు ఏమీ...

Updated : 26 Oct 2021 08:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రీడాస్ఫూర్తి.. ఇది ఏ ఆటలోనైనా క్రీడాకారులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అందుకు టీమ్‌ఇండియా, పాక్‌ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ క్రీడాస్ఫూర్తి చాటడంలో ముందుంటారు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించారు. పాకిస్థాన్‌తో ఓటమిపాలయ్యాక విరాట్‌.. బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ దగ్గరికెళ్లి హత్తుకొని మరీ నవ్వుతూ అభినందించాడు. ఈ సన్నివేశాలు ఇరు జట్ల అభిమానులను ఆకట్టుకున్నాయి. 

(Photo: Dhoni Trends Twitter)

మరోవైపు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆన్‌ఫీల్డ్‌ అయినా, ఆఫ్‌ ఫీల్డ్‌ అయినా తనదైన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడు. సింపుల్‌గా ఉంటూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనంతరం అతడు మైదానంలోనే పలువురు దాయాది జట్టు ఆటగాళ్లతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆటకు సంబంధించిన కొన్ని విషయాలను వారితో సంతోషంగా పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి అంటూ భారత్‌-పాక్‌ క్రికెట్‌ జట్లను మెచ్చుకుంది. దాయాదుల పోరుపై బయట ఉండేటంత భావోద్వేగం, ఉద్రేకం లాంటివి రెండు జట్ల మధ్య ఉండవని అభిప్రాయపడింది. ఆ ఫొటోలు, వీడియో మీరూ చూసి ఆనందించండి.

ఇక పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెషనవాజ్‌ దహాని సైతం ధోనీతో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించడం, నా ఫెవరెట్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్ ధోనీని కలవడం.. ఇదో ప్రత్యేక సందర్భం’ అని పేర్కొని అతడు కూడా క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని