IND vs PAK : రోహిత్‌ శర్మను టీ20ల నుంచి తొలగిస్తారా?

2021 టీ20 ప్రపంచకప్‌లో (2021 t20 world cup) పాకిస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(0) విఫలమవ్వడంపై మీడియా నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు టీమ్‌ఇండియా...

Published : 25 Oct 2021 09:56 IST

జర్నలిస్టు ప్రశ్నకు దీటుగా బదులిచ్చిన కోహ్లీ.. ఒకటే నవ్వులు

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021 టీ20 ప్రపంచకప్‌లో (2021 t20 world cup) పాకిస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(0) విఫలమవ్వడంపై మీడియా నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీటుగా బదులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి. దాయాదుల పోరులో హిట్‌మ్యాన్‌ తొలి ఓవర్‌లోనే షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. రోహిత్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించడంపై ఓ ప్రశ్న వేశాడు.

విలేకరి: ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తుదిజట్టు ఎంపికపై చాలా మంది మాట్లాడుతున్నారు. వార్మప్‌ మ్యాచ్‌లో బాగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ను కాకుండా రోహిత్‌ శర్మను తీసుకోవడంపై చింతిస్తున్నారా? రోహిత్‌ కన్నా ఇషాన్‌ బాగా ఆడేవాడుకుంటున్నారా?

కోహ్లీ: మీరు.. అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్‌ను తొలగిస్తారా? మీరు అలా చేయగలరా? మేం ఆడిన గత మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఎలా ఆడాడో మీకు తెలుసా?ఇదేం ప్రశ్న. అసలు ఊహించనిది. మీకేమైనా వివాదాస్పద వ్యాఖ్యలు కావాలంటే ముందే చెప్పండి.. అందుకు తగ్గట్టే సమాధానం ఇస్తా.

ఇక ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో ఈసారి అతి విశ్వాసంతో బరిలోకి దిగారా అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు విరాట్‌ స్పందించాడు. వాస్తవిక పరిస్థితులకు, బయట ప్రజలు మాట్లాడుకునేదానికి చాలా తేడా ఉంటుందని, ఇదో విచిత్రమని చెప్పాడు. తమ కన్నా పాకిస్థాన్‌ బాగా ఆడిందనడంలో ఎలాంటి భేషాజాలు లేవని, వాళ్లు ఈ ఆటలో పూర్తి ఆధిపత్యం చలాయించారని కోహ్లీ బదులిచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని