IND vs PAK: కొడుకు గర్వపడేలా చేస్తే... ఏ తండ్రైనా ఇంతే! 

ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ తొలి విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి...

Updated : 26 Oct 2021 05:42 IST

బాబర్‌ అజామ్‌ తండ్రి కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ తొలి విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతరాత్రి భారత్‌పై పది వికెట్ల తేడాతో పాక్‌ గెలవగానే దుబాయ్‌ స్టేడియం మొత్తం ఆ దేశ అభిమానుల సందడితో హోరెత్తింది. ఈ క్రమంలోనే అదే స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తండ్రి అజామ్‌ సిద్దిఖి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుమారుడి చిరస్మరణీయ ఆట పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఎంతైనా ఒక కుమారుడు గొప్ప పని చేస్తే ఏ తండ్రి అయినా ఇలాగే గర్వపడతారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగినా ఘోర పరాభవం పాలైంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు  151/7 స్కోరే సాధించింది. అనంతరం పాక్‌ 17.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనర్లు రిజ్వాన్‌ (79*), బాబర్‌ (68*) పాక్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత (12-1) ఆధిపత్యానికి తెరదించారు. దిగ్గజాలకు సాధ్యం కాని ఈ రికార్డును బాబర్‌ ఈ మ్యాచ్‌తో తిరగరాశాడు. ఈ క్రమంలోనే అతడి తండ్రి పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని