T20 World Cup: భారత్‌ ఒక్క మ్యాచే ఓడింది.. భారీ మార్పులు అనవసరం

టీమ్‌ఇండియా ఈ టీ20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచే ఓడిందని, అలాంటప్పుడు తుదిజట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 16 Nov 2021 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఈ టీ20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచే ఓడిందని, అలాంటప్పుడు తుదిజట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ - కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ బాగుందని చెప్పాడు. దాన్ని అలాగే కొనసాగించాలని సూచించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ (0), రాహుల్‌ (3) పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్‌ను పక్కనపెట్టి, ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన అథర్టన్‌ అలా చేయాల్సిన అవసరం లేదన్నాడు.

‘ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా రోహిత్‌ను పక్కనపెట్టి ఇషాన్‌ను ఆడించింది. అప్పుడు అతడు రాహుల్‌తో ఓపెనింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ కన్నా ఇషాన్‌ బాగా ఆడినా పవర్‌ప్లేలో రాహులే ధాటిగా ఆడాడు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. మరోవైపు రోహిత్ శర్మ ఆటను పరిశీలిస్తే తొలుత కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తాడు. అలాంటప్పుడు టీమ్‌ఇండియా.. రోహిత్-రాహుల్‌ కాంబినేషన్‌ను ఆడించడం సరైన నిర్ణయమే. వీరిద్దరినీ ఇలాగే కొనసాగించాలి. అలాగే పాకిస్థాన్‌తో ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన భారత జట్టును తక్కువ చేసి చూడొద్దు’ అని అథర్టన్‌ వివరించాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలయ్యాక తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్‌ సైతం పాక్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఇరు జట్లకూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని