IND vs PAK: టీమ్‌ఇండియా అంతా మ్యాచ్‌ విన్నర్లే..

‘క్లాస్‌లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్‌ చెప్తాడు. కానీ, ఎగ్జామ్‌లో రాసినోడే టాపర్‌ అవుతాడు’ ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు సరిగ్గా సరిపోతుంది.

Updated : 22 Oct 2021 12:17 IST

పాకిస్థాన్‌ కన్నా పటిష్ఠంగా భారత్

‘క్లాస్‌లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్‌ చెప్తాడు. కానీ, ఎగ్జామ్‌లో రాసినోడే టాపర్‌ అవుతాడు’ ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు సరిగ్గా ఇది సరిపోతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లు జరిగినా వన్డే, టెస్టు క్రికెట్‌లో వాస్తవికంగా దాయాది జట్టుదే పైచేయి. కానీ, ప్రపంచకప్పుల విషయానికొస్తే టీమ్‌ఇండియానే టాప్‌. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్పుల్లో భారత్‌దే సంపూర్ణ ఆధిపత్యం. ఇక ఈ ఆదివారం రెండు జట్ల మధ్య మరో హోరాహోరీ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత జట్ల బలాబలాలేంటో తెలుసుకుందాం.

200వ చారిత్రక మ్యాచ్‌ ఎవరిది?

ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య మొత్తం 199 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 1947లో భారత్‌, పాక్‌ విడిపోయాక రెండు దేశాలు ఐసీసీలో శాశ్వత సభ్యత్వ దేశాలుగా చేరాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రసవత్తర పోరులు జరిగినా వేటికవే ప్రత్యేకం. అందులో పాకిస్థాన్‌ మొత్తం 86 మ్యాచ్‌లు కైవసం చేసుకోగా భారత్‌ 70 విజయాలు సాధించింది. ఐసీసీ ఈవెంట్లు కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ఇతర టోర్నీల్లో పాకిస్థాన్‌దే పైచేయి. ఇరు జట్ల మధ్య జరిగిన మొత్తం 59 టెస్టుల్లో పాకిస్థాన్‌ 12‌, టీమ్‌ఇండియా 9 విజయాలు సాధించాయి. మరో 38 టెస్టులు డ్రాగా ముగిశాయి. అలాగే 132 వన్డేల్లో దాయాది జట్టు 73, భారత్‌ 55 విజయాలు సాధించాయి. ఇక టీ20ల్లో మొత్తం 8 మ్యాచ్‌లు జరగ్గా టీమ్‌ఇండియానే 6 నెగ్గింది. పాకిస్థాన్‌ 1 మ్యాచ్‌ గెలుపొందింది. ఇందులో ఐదు మ్యాచ్‌లు ప్రపంచకప్‌లలో జరిగినవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే 200వ చారిత్రక మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఇక్కడంతా మ్యాచ్‌ విన్నర్లే..

ప్రస్తుత టీమ్‌ఇండియా పాకిస్థాన్‌ కన్నా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్‌లో ప్రపంచంలోని ఏ జట్టుకు తీసిపోని విధంగా సీనియర్లు, జూనియర్లు రెచ్చిపోతున్నారు. ఈవారం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. మరోవైపు ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లంతా జోరు చూపించారు. సన్నాహక మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ లాంటి ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌ పవర్‌ చూపించి పాకిస్థాన్‌తో కీలకపోరుకు ముందు ఫామ్‌లోకి వచ్చారు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌ చెలరేగితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తుదిజట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇందులో జడేజా కచ్చితంగా ఉంటాడనే చెప్పొచ్చు. ఐపీఎల్‌లో అతడు బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన సంగతి తెలిసిందే. అతడికి తోడుగా మరో స్పిన్నర్‌ ఎంపికైనా లేక శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకున్నా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చివరగా బౌలింగ్‌లో జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భువి వికెట్లు తీయకపోయినా వార్మప్‌ మ్యాచ్‌లో తక్కువ పరుగులిచ్చి పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. దీంతో ఎలా చూసిన టీమ్‌ఇండియా మొత్తం మ్యాచ్‌ విన్నర్లే కనిపిస్తున్నారు.

అక్కడ నలుగురైదుగురే..

మరోవైపు పాకిస్థాన్‌ జట్టులో నలుగురైదుగురు మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, ఫకర్‌ జమాన్‌ మాత్రమే టాప్‌ ఆర్డర్‌లో పరుగులు చేస్తూ ఫామ్‌లో ఉన్నారు. టీమ్‌ఇండియా వీరిని కట్టడి చేస్తే పాకిస్థాన్‌ భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకునే వీలుంది. బౌలింగ్‌లో షాహీన్‌ అఫ్రిది ఒక్కడే కాస్త ఫరవాలేదనిపిస్తున్నాడు. మరోవైపు హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ ఎప్పుడెలా బంతులేస్తారో అర్థంకాని పరిస్థితి. దీంతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ వీరిపై ఆధిపత్యం చలాయిస్తే పరుగుల వరద పారించొచ్చు. అందుకు ఇటీవల పాక్‌ ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌లే నిదర్శనం. వెస్టిండీస్‌పై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు దక్షిణాఫ్రికాతో భారీ స్కోర్‌ సాధించినా ఓటమిపాలైంది. పాక్‌ బౌలర్లను సఫారీలు దంచికొట్టారు. దీంతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ సైతం తొలి మ్యాచ్‌లో రెచ్చిపోతే పని తేలికవుతుంది. అయితే, పాక్‌ను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. తమదైన రోజు ఆ జట్టు ఎంతటి గొప్ప జట్టునైనా ఓడించగలదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఎంత బాగా ఆడితే అంత మంచిది. మరోవైపు దక్షిణాఫ్రికాతో ఓటమిపాలవ్వడం పాక్‌ ఆటగాళ్లపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపై విజయం సాధించిన టీమ్‌ఇండియా అదే ఆత్మవిశ్వాసంతో పాక్‌ను ఓడించేలా పటిష్ఠంగా కనిపిస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని