
T20 World Cup: అరుదైన రికార్డు.. యువీ సరసన నిలిచిన మార్ష్, హేజిల్‌వుడ్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతరాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలుపొందడంతో వీరిద్దరూ టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరసన చేరారు. ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లు సాధించిన జట్లలో ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచిన యువీకి.. ఈ ఆసీస్ ఆటగాళ్లు తోడయ్యారు. యువీ 2000లో అండర్-19, 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సాధించిన జట్లలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తాజాగా మార్ష్, హేజిల్‌వుడ్ ఆ రికార్డును చేరుకున్నారు. వీరిద్దరూ 2010లో అండర్-19 ప్రపంచకప్‌తో పాటు, 2015 వన్డే ప్రపంచకప్ సాధించారు. తాజాగా 2021 టీ20 ప్రపంచకప్ గెలుపొందిన జట్టులోనూ పాలుపంచుకొని అరుదైన రికార్డులో భాగమయ్యారు. మరోవైపు ఈ తుదిపోరులో ఆసీస్ విజయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. తొలుత బౌలింగ్‌లో హేజిల్‌వుడ్ కట్టుదిట్టంగా బంతులేసి 3/16 మెరుగైన ప్రదర్శన చేయగా.. ఛేదనలో మార్ష్ (77 నాటౌట్) దంచికొట్టాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.