
T20 World Cup: షేన్‌వార్న్ సంచలన వ్యాఖ్యలు.. ఆసీస్ అభిమానుల ఆగ్రహం
ఇంటర్నెట్‌డెస్క్: స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్ తాజాగా ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన స్టీవ్‌స్మిత్ టీ20 జట్టులో ఉండకూడదని విమర్శలు చేశాడు. శనివారం రాత్రి ఆసీస్.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులకే ఆలౌటైంది. టాప్ఆర్డర్లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. డేవిడ్ వార్నర్ (1), స్టీవ్‌స్మిత్ (1), మాక్స్వెల్ (6), స్టాయినిస్ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు చేయడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోస్‌బట్లర్ (71; 32 బంతుల్లో 5x4, 5x6) దంచికొట్టాడు. ఈ నేపథ్యంలోనే వార్న్ ట్వీట్ చేస్తూ ఆసీస్ జట్టును ఎండగట్టాడు.
జట్టు సెలెక్షన్ బాగోలేదని, మార్ష్‌ను తీసుకోకపోవడం నిరాశ కలిగించిందని అసహనం వ్యక్తం చేశాడు. అలాగే మాక్స్వెల్ పవర్‌ప్లేలో బ్యాటింగ్‌కు రావడం తప్పని, అతడి స్థానంలో స్టాయినిస్ నాలుగో ఆటగాడిగా వెళ్లాల్సి ఉందన్నాడు. మాక్సీ మధ్య ఓవర్లలోనే బరిలోకి దిగాలని సూచించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎంపిక బాగోలేదని, ప్రణాళికలు కూడా సరిగ్గా లేవన్నాడు. చివరగా తనకు స్మిత్ అంటే ఇష్టమని చెబుతూనే టీ20 జట్టులో ఉండకూడదని అన్నాడు. అతడి స్థానంలో మార్ష్‌ను ఆడించాల్సి ఉండేదని షేన్‌వార్న్ పేర్కొన్నాడు. కాగా, ఈ ట్వీట్‌పై ఆసీస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్మిత్ ఇదొక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని, ఇలాంటి పనికిమాలిన సూచనలు చేయొద్దని అతడిపై మండిపడుతున్నారు.