IND vs PAK: ‘భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ రికార్డులు ఎవరూ పట్టించుకోరు’

ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ల రికార్డులు, గణాంకాలు ఇరు జట్లలోని ఆటగాళ్లలో ఎవరూ పట్టించుకోరని, అది కేవలం గణాంకాలు నమోదు చేసే వ్యక్తి పని మాత్రమేనని...

Published : 22 Oct 2021 15:02 IST

పాక్‌ మాజీ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ల రికార్డులు, గణాంకాలు ఇరు జట్లలోని ఆటగాళ్లలో ఎవరూ పట్టించుకోరని, అది కేవలం గణాంకాలు నమోదు చేసే వ్యక్తి పని మాత్రమేనని ఆ జట్టు దిగ్గజ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. ఆదివారం దాయాది జట్ల మధ్య 2021 టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్‌లో నిర్వహిస్తోన్న సలాం క్రికెట్‌ కార్యక్రమంలో అక్రమ్‌ పాల్గొన్నాడు.

‘ప్రపంచకప్‌లలో మేం భారత్‌ను ఓడించలేదనేది నిజమే కానీ, ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ ఎక్కువ విజయాలు సాధించింది. నేను వాళ్లతో ఐదు వన్డే ప్రపంచకప్‌లు ఆడినా ఇప్పటికీ టీమ్‌ఇండియాపై ఒక్క మ్యాచ్‌ గెలవలేదు. అది అంగీకరిస్తా. అయితే, భారత్‌-పాక్‌ ఆటగాళ్లు ప్రపంచకప్‌ టోర్నీల్లో బరిలోకి దిగేటప్పుడు ఇవన్నీ పట్టించుకోరు. ఆ పని స్టాటిషియన్‌ చూసుకుంటాడు. ఒక ఆటగాడిగా నాకూ, లేదా పాకిస్థాన్‌ ఆటగాళ్లకు, లేదా టీమ్ఇండియా ఆటగాళ్లకు ఎవ్వరికీ ఈ రికార్డులతో పనిలేదు’ అని అక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్‌ ఈవెంట్లలో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమేనని, ప్రతి జట్టూ విజయం కోసమే అక్కడ ఆడతాయని మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఎక్కువ ప్రాధాన్యమని తెలిపాడు. ప్రపంచకప్‌ ఈవెంట్‌లోనే ఇదో పెద్ద మ్యాచ్‌గా నిలుస్తుందన్నాడు. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. అలాగే మ్యాచ్‌ ప్రారంభమయ్యాక ఇవన్నీ ఏం గుర్తుకురావన్నాడు. ఆటగాళ్లంతా అక్కడ ఎలా గెలవాలనే ఆలోచిస్తారన్నాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనౌతారని.. కానీ అందరూ కాస్త అదుపులో ఉండాలని వసీమ్‌ అక్రమ్‌ వివరించాడు. కాగా, ఇప్పటివరకు టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో దాయాది జట్టుదే పైచేయి. కానీ, ప్రపంచకప్పుల్లో మాత్రం భారత్‌దే పూర్తి ఆధిపత్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని