T20 World Cup: అయ్యో రసెల్‌.. ఇలా ఔటయ్యావేంటి?

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆటగాళ్లకు అప్పుడప్పుడు జీవనదానాలు లభించి ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకునే సంగతి మనకు తెలిసిందే...

Updated : 30 Oct 2021 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆటగాళ్లకు అప్పుడప్పుడు అదృష్టం కలిసొచ్చి ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. అలాగే దురదృష్టం కొద్దీ ఔటయ్యే సందర్భాలూ చూస్తుంటాం. ఒక్కోసారి ఊహించని రీతిలో కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంటారు కూడా. అలాంటి సంఘటనే ఇప్పుడు వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌కు ఎదురైంది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌తో తలపడిన మ్యాచ్‌లో ఈ ప్రమాదకర హిట్టర్‌ ఒక్క బంతీ ఎదుర్కోకుండా పెవిలియన్‌ చేరడం నిరాశపర్చింది. ఆ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 142/7 స్కోర్‌ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లా బౌలర్‌ టస్కిన్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో కీరన్‌ పొలార్డ్‌ (14) మూడో బంతికి సింగిల్‌ తీసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రసెల్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నిల్చోగా.. టస్కిన్‌ తర్వాతి బంతి వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న రాస్టన్‌ ఛేజ్‌ (39*) నేరుగా బౌలర్‌ వైపే స్ట్రైట్‌డ్రైవ్ ఆడాడు. దానికి వెంటనే స్పందించిన టస్కిన్‌ కాలు అడ్డుపెట్టాడు. బంతి షూని తాకి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. అప్పటికే క్రీజు బయట ఉన్న రసెల్‌ తిరిగి క్రీజులో బ్యాట్‌ పెట్టేసరికే బంతి బెయిల్స్‌ను లేపేసింది. దీంతో అంపైర్‌ ఔటివ్వగా రసెల్‌ (0) ఒక్క బంతీ ఎదుర్కోకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. ఈ వీడియోను పంచుకున్న ఐసీసీ.. ‘మనం ఏం చూశాం?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మీరూ ఈ ఊహించని రనౌట్‌ చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని