
Virat Kohli Bowling: వావ్.. రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీ బౌలింగ్ చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో విరాట్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులకు కొత్త అనుభూతి కలిగించాడు. అయితే, అతడు ఒక్క వికెట్ తీయకపోయినా 12 పరుగులు ఇచ్చాడు. ఐసీసీ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని ‘కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీని బౌలింగ్‌కు దింపాడు. అవును మీరు చదివింది నిజమే’ అని సరదా వ్యాఖ్యను జోడించి పోస్టు చేసింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకోవడం విశేషం. టాస్వేసే సమయంలో కోహ్లీ వస్తాడనుకుంటే రోహిత్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి రోహిత్ టాస్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము హార్దిక్ పాండ్యతో బౌలింగ్ చేయించడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ ప్రయోగాలు చేస్తున్నామని చెప్పాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 152/5 స్కోర్ సాధించింది. అయితే, రెండో ఓవర్లోనే బంతి అందుకున్న అశ్విన్ టీమ్ఇండియాకు శుభారంభం అందించాడు. ఆ ఓవర్ చివరి రెండు బంతుల్లో వార్నర్(1), మిచెల్ మార్ష్ (0)ను పెవిలియన్‌కు పంపాడు.
ఇక జడేజా సైతం మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్(8)ను త్వరగానే ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో స్టీవ్‌స్మిత్ (57), మ్యాక్స్‌వెల్ (37) పట్టుదలగా ఆడారు. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే, బాగా ఆడుతున్న సమయంలో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ బౌల్డయ్యాడు. అనంతరం స్మిత్‌తో కలిసి స్టాయినిస్ (41) భారత బౌలర్లపై చెలరేగాడు. దీంతో ఆ జట్టు 150కిపైగా స్కోర్ సాధించింది. ఈ క్రమంలోనే విరాట్ ఇన్నింగ్స్‌లోని 6, 13వ ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడి బౌలింగ్‌లో స్టాయినిస్ ఒక బౌండరీ బాదటం విశేషం. అనంతరం టీమ్ఇండియా 17.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. రాహుల్ ఔటయ్యాక అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆపై సూర్యకుమార్ యాదవ్ (38*), హార్దిక్ పాండ్య (14*) నాటౌట్‌గా నిలిచి విజయాన్ని అందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.