Published : 24 Oct 2021 01:24 IST

IND vs PAK: భారత్‌ 12.. పాకిస్థాన్‌ 0.. దిగ్గజాలు ఏమన్నారంటే?

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ఆదివారం దుబాయ్‌ వేదికగా 2021 టీ20 ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంత ఆసక్తిగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ ఆ వాతావరణం మరింత వేడెక్కింది. ఇప్పటి వరకూ జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌, పాక్‌ 12 సార్లు తలపడగా.. సంపూర్ణ ఆధిపత్యం టీమ్‌ ఇండియాదే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్లతో పాటు పలువురు మాజీలు సైతం ఈ మ్యాచ్‌పై  స్పందించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 

ఎవరేమన్నారో ఇక్కడ చూద్దాం..

 ‘‘ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌పై భారత్‌ ఆధిక్యం 13-0 అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యర్థిపై అజేయంగా ఉన్న రికార్డును టీమ్‌ఇండియా కొనసాగిస్తుంది. ఈ జట్టులోని   ఆటగాళ్లందరూ నిజమైన మ్యాచ్‌ విన్నర్లు. ప్రపంచకప్‌ గెలవాలనే పదేళ్ల నిరీక్షణకు ఈ జట్టు ముగింపు పలుకుతుందనే ఆశతో ఉన్నాం’’ - సౌరభ్‌ గంగూలీ


‘‘అవును.. ప్రపంచకప్‌ల్లో మేం భారత్‌ను ఓడించలేదు. కానీ వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో అడుగు పెట్టేటప్పుడు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది గణాంక నిపుణుడి పని. కానీ ఓ ఆటగాడిగా ఈ రికార్డు నన్ను కానీ లేదా ఏ పాకిస్థాన్‌, భారత్‌ ఆటగాణ్ని కానీ ప్రభావితం చేయదనే అనుకుంటా. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఎంతో కీలకమైంది. టోర్నీలో ఇదే పెద్ద మ్యాచ్‌’’ - వసీమ్‌ అక్రమ్‌


 ‘‘ఒక బౌలర్‌గా నేను.. బుమ్రా ఈ టోర్నీలో ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నా. అతను ముందుకొచ్చి వికెట్లు తీయడంతో పాటు దేశం కోసం టోర్నీని గెలిచే బాధ్యత   భుజాలకెత్తుకోవాలి. మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలవాలి. జట్టులో అతనో విశిష్టమైన ఆటగాడు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌లో అతను నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు’’  - కపిల్‌ దేవ్‌


‘‘భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనేది ఎప్పుడూ అధిక ఒత్తిడిలో జరుగుతుంది. అలాంటప్పుడు ఏ జట్టు బాగా ఒత్తిడిని తట్టుకొని ఆడుతుందో అదే గెలుస్తుంది. అలాగే తక్కువ తప్పులు చేసే జట్టే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి’’  -షాహిద్‌ అఫ్రిది


 ‘‘భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ భారీగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌ చుట్టూ ఎన్నో ఊహాగానాలు నెలకొంటాయి, ప్రచారం సాగుతోంది. ఈ పోరులో టీమ్‌ఇండియానే స్పష్టమైన   ఫేవరెట్‌. అదే వేదికల్లో ఐపీఎల్‌ ఆడిన భారత్‌కు పాక్‌ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది’’ - మహమ్మద్‌ అజహరుద్దీన్‌


‘‘ధోని మెంటార్‌గా రావడం ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాక్‌ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మా జట్టు గెలిచి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని 1-5కి తగ్గిస్తుందని అనుకుంటున్నా. ఇలాంటి మ్యాచ్‌ల్లో రాణించిన వాళ్లే దిగ్గజాలుగా ఎదుగుతారు’’ - యూనిస్‌ ఖాన్‌


 ‘‘ఉపఖండంలో టీమ్‌ఇండియా అంత ప్రమాదకరమైన జట్టు ఏదీ ఉండదు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టోర్నీ మొత్తం పూర్తి ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. ఇక ఆదివారం దాయాది   జట్ల మధ్య పోరు చూడటం అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇది టీ20 క్రికెట్‌ అయినందున ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టం. ఒకవేళ ఇందులో పాక్‌ గెలిస్తే.. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం ఇదే తొలిసారి అవుతుంది’’ -ఇంజమామ్‌ ఉల్‌ హక్‌


‘‘ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పోటీపడినప్పుడల్లా టీమ్‌ఇండియా ఎక్కువ ఒత్తిడికి గురికాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో భారత్‌ ఎప్పుడూ పాక్‌ కన్నా మెరుగైన ప్రదర్శనే చేసింది. అలాగే ప్రతిసారీ పాక్‌ ఆటగాళ్ల నుంచే పెద్ద పెద్ద మాటలు వినిపిస్తాయి.భారత్‌లో ఎవరూ అలా చేయరు. టీమ్‌ఇండియా కేవలం బాగా సన్నద్ధమవ్వడంపైనే దృష్టిసారిస్తుంది. అలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మనకు తెలిసిందే’’ -వీరేంద్ర సెహ్వాగ్‌


 ‘‘ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది టీ20 మ్యాచ్‌. ఎవరైనా గెలవొచ్చు. కానీ, టీమ్‌ఇండియానే కాస్త ఫేవరెట్‌గా ఉంది. ఆ జట్టు ఐపీఎల్‌ ఆడి నేరుగా   ప్రపంచకప్‌లో ఆడుతుండటంతో అక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుంది. ఇక విరాట్‌ కోహ్లి ఓ దిగ్గజం. ఎప్పుడూ నిలకడగా రాణించే అతడి ఆటతీరు అద్భుతం. దాయాదుల పోరులో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఎలా సత్తాచాటాలో కోహ్లీకి తెలుసు’’ - మహమ్మద్‌ ఆమిర్‌


‘‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. రెండు జట్ల ఆటగాళ్లు అన్ని మ్యాచ్‌ల్లాగే ఇది కూడా సాధారణ మ్యాచ్‌లాగే ఉంటుందని చెబుతారు. కానీ, అది నిజం కాదు. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతారు. ఎవరైతే దాన్ని తట్టుకుంటారో వారే విజేతగా నిలుస్తారు’’  -సురేశ్‌ రైనా


 ‘‘పాకిస్థాన్‌ గెలవాలంటే ధైర్యంగా ఆడాలి. కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలి. భారత్‌ బలంగా ఉన్నా దాన్ని చూసి భయపడొద్దు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు   కోహ్లీసేనలో ఉన్నారు. కానీ, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు టీమ్‌ఇండియా పటిష్ఠంగా ఉన్నా పాకిస్థాన్‌ తక్కువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో గెలవడానికి రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది’’ -షోయబ్‌ అక్తర్‌


‘‘ఈ మ్యాచ్‌లో నాయకత్వమే కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అతడు సారథిగా కొనసాగుతూనే ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఆడాల్సి ఉంటుంది. మరోవైపు టీమ్ఇండియాలో కేఎల్‌ రాహుల్‌ పాకిస్థాన్‌కు కీలక వికెట్‌గా మారనున్నాడు. అతడు పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించడం నేను గమనించా. అతడే ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకర బ్యాట్స్‌మన్‌’’ - మాథ్యూ హెడెన్‌


 ‘‘పాకిస్థాన్‌ యూఏఈ పిచ్‌లపై బాగా ఆడుతుంది. తనదైన రోజు ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడిస్తుంది. ఈసారి ఎలాగైనా భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. అయితే, టీమ్‌ఇండియా   పైచేయి సాధిస్తుంది. ప్రపంచకప్‌లో దాయాది జట్టుపై భారత జట్టుకు అమోఘమైన చరిత్ర ఉంది. దీంతో పాకిస్థాన్‌పైనే ఒత్తిడి ఉంటుంది. టీమ్‌ఇండియాకు కాదు’’  -మాంటీ పనేసర్‌

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని