T20 World Cup: రోహిత్‌ను కాదని ఇషాన్‌ను ఎందుకు తీసుకొచ్చారు..?

న్యూజిలాండ్‌తో పోరులో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడం కంటే ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్థాన్‌తో ఓడినప్పుడు కూడా సగటు అభిమానికి ఇలాంటి అసహనానికే గుయ్యాడు...

Updated : 16 Nov 2021 15:21 IST

టీమ్‌ఇండియా వ్యూహాలపై మాజీల ఆశ్చర్యం..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో పోరులో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడం కంటే ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్థాన్‌తో ఓడినప్పుడు కూడా సగటు అభిమాని ఇలాంటి అసహనానికే గుయ్యాడు. అయితే, కివీస్‌తో పోరులో తమ తప్పులు సరిదిద్దుకొని బాగా ఆడతారని ఆశించిన భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి చేతులెత్తేయడంతో ఏం మాట్లాడాలో అర్థంకావడం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్‌, రాహుల్‌ హిట్‌ పెయిర్‌ని కాదని, ఇషాన్‌తో ఓపెనింగ్‌ చేయించాలనే సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ, ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. దీనిపై పలువురు క్రికెట్‌ దిగ్గజాలు ఏమన్నారో వారి మాటల్లో..

* టీమ్‌ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో పట్టుదలతో ఆడలేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా స్కోర్‌బోర్డుపై సరైన పరుగులు చేయకపోతే మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించలేరు. 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే అద్భుతం జరగాలి. ఈ రెండు మ్యాచ్ల్లో టీమ్‌ఇండియా తేలిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో ఆదిలోనే పైచేయి సాధించకపోతే తర్వాత చాలా కష్టమవుతుంది. అయితే, కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు కెప్టెన్‌ తీసుకోలేడు. రోహిత్‌ను వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా పంపడం అనేది కోహ్లీ ఒక్కడి నిర్ణయమే కాకపోయి ఉండొచ్చు. ధోనీ, రవిశాస్త్రి లాంటి వారు ఉండగా ఆ నిర్ణయం తీసుకోలేడు. ఏదేమైనా రోహిత్‌ను అలా పంపడం తప్పుడు నిర్ణయమే. అతడెన్నో ఏళ్లుగా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఈ ఒక్క చర్యతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తం మారింది   -మదన్‌లాల్‌

* బ్యాటింగ్‌ ఆర్డర్‌లో టీమ్‌ఇండియా ఈరోజు చేసిన మార్పు బెడిసికొట్టింది. రోహిత్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ మూడో స్థానంలో ఆడటం, అక్కడ ఎంతో బాగా రాణించే కోహ్లీ నాలుగులో ఆడటం అన్నీ విఫలమయ్యాయి. ఇషాన్‌ లాంటి యువకుడికి ఓపెనింగ్‌ చేసే బాధ్యతలు అప్పగించారు. అతడు కొడితే కొడతాడు. లేకపోతే లేదు. అతడి లాంటి ఆటగాడు నాలుగు లేదా ఐదులో రావాల్సింది. అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఆడగలడు. ఇప్పుడిలా చేయడం ద్వారా ‘రోహిత్‌.. నువ్వు లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ను ఎదుర్కోలేవు’ అని చెప్పినట్లు అవుతుంది. దీంతో ఇన్నాళ్లుగా ఓపెనింగ్‌ చేస్తున్న అతడికి తన బ్యాటింగ్‌ సామర్థ్యంపై సందేహం కలిగించినట్లు అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ 70 పరుగులు చేసుంటే మనమంతా మెచ్చుకునే వాళ్లం. కానీ, అలా జరగనప్పుడే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  -సునీల్‌ గావస్కర్‌

* ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై కెప్టెన్‌ కోహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే, అందుకు కోహ్లీ ఒక్కడే కారణం కాదు. ఈ ఓటములకు జట్టు మొత్తంతో పాటు కోచ్‌లు కూడా బాధ్యత వహించాలి. ఇది భారత అభిమానులకు భయపెట్టే హలోయిన్‌ డేగా మారింది.   -అజహరుద్దీన్‌

* టీమ్‌ఇండియా చూస్తుంటే ఈ ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎంతో నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు సరైన ఆటతీరు, ఆలోచనా విధానంతో కనపడట్లేదు. వాళ్లింకా 2010కాలం నాటి క్రికెటే ఆడుతున్నారు.
ఒక విధంగా నిజం చెప్పాలంటే.. ఆ జట్టులో ఉన్న నైపుణ్యమైన ఆటగాళ్లు, రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్నంత బలగంతో కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏమీ సాధించలేకపోయారు. ఇకపై టీమ్‌ఇండియా ఆటగాళ్లను ప్రతి జట్టుతో ఆడించాలి. వాళ్ల ఆటగాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగుల్లో ఆడించేలా చేయాలి.  - మైఖేల్‌ వాన్‌

* టీమ్‌ఇండియా ప్రదర్శన నిరాశకు గురిచేసింది. ఆటగాళ్ల ఆటతీరు ఏమాత్రం బాలేదు. గతంలో పలుమార్లు మాదిరే షాట్ల సెలెక్షన్‌ కూడా అస్సలు బాలేదు. ఈ దెబ్బతో టీమ్‌ఇండియా సెమీస్‌ చేరకుండా న్యూజిలాండ్‌ అడ్డుకుంది. ఇది టీమ్‌ఇండియాకు బాధ కలిగించేదే అయినా కచ్చితంగా జట్టులో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.    -వీరేంద్ర సెహ్వాగ్‌

* ఈ ఓటమి టీమ్‌ఇండియాను బాధపెట్టాలి. బ్యాట్‌తో సరిగ్గా ఆడలేకపోయారు. షాట్‌ సెలెక్షన్‌ కూడా నమ్మశక్యంగా లేదు. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బంతులేసినా భారత బ్యాట్స్‌మెన్‌ వాళ్ల పని తేలిక చేశారు. వాళ్ల నెట్‌రన్‌రేట్‌ కూడా మెరుగ్గా ఉండటంతో ఇక సెమీస్‌ ఫైనల్‌లో చోటు అందని ద్రాక్షలా మారింది.   -వీవీఎస్ లక్ష్మణ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని