Updated : 16 Nov 2021 15:34 IST

Virat Kohli - Ravi Shastri: కోహ్లీ-శాస్త్రి విజయవంతమయ్యారా.. లేదా?

ఈ టీ20 ప్రపంచకప్పే చివరి అవకాశం..

విరాట్‌ కోహ్లీ - రవిశాస్త్రి ద్వయం విజయవంతమైందా.. లేదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. దీంతో ఇద్దరూ తమ చివరి అవకాశంగా ఇప్పుడు జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌పైనే దృష్టి సారించారు. ఇది గెలిచి మరింత గొప్ప పేరు తెచ్చుకొని విమర్శకుల నోర్లు మూయించాలని చూస్తున్నారు. కాగా, వీరి కాంబినేషన్‌లో టీమ్‌ఇండియా ప్రయాణం ఎలా సాగిందో పరిశీలిద్దాం..

కుంబ్లే పాయె.. శాస్త్రి వచ్చే..

2017 జులైలో రవిశాస్త్రి టీమ్‌ఇండియా కోచింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. అంతకుముందు నాటి కోచ్‌ అనిల్‌కుంబ్లేతో సారథి విరాట్‌ కోహ్లీకి అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమ్‌ఇండియా తొలిసారి ఒక ఐసీసీ ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అనంతరం సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్న క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ శాస్త్రిని కోచ్‌గా నియమించింది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్లు టీమ్‌ఇండియా బాధ్యతలు చూసుకున్నాడు మాజీ ఆల్‌రౌండర్‌.

చారిత్రక గెలుపు.. కలచివేసే ఓటమి..

శాస్త్రి జట్టు బాధ్యతలు తీసుకున్నాక టీమ్‌ఇండియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఎదిగింది. మునుపెన్నడూ చూడని ఫలితాలు సాధించింది. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటన, 2018 ఇంగ్లాండ్‌ పర్యటన మినహా మిగతా అన్ని సిరీసుల్లోనూ కోహ్లీసేన విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా 2018-19 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ-శాస్త్రి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తింది. ఏ ఆసియా జట్టుకు వీలుకాని, ఏ భారత దిగ్గజ సారథికీ సాధ్యం కాని చారిత్రక విజయాన్ని టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. తొలిసారి 2-1 తేడాతో కంగారూల గడ్డపై సగర్వంగా కోహ్లీసేన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌లో టాప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది. ముఖ్యంగా బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా సెమీస్‌ లాంటి కీలకపోరులో తడబడింది. అప్పటికే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ సైతం ఆ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. జడేజా (77), ధోనీ (50) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. టీమ్ఇండియా విజయానికి చేరవలో వచ్చి ఓటమిపాలైంది. ఇది అభిమానులనే కాకుండా జట్టు సభ్యులను కూడా ఎంతో కలచివేసింది.

టెస్టు ఛాంపియన్‌షిప్‌.. మరో చారిత్రక ఘట్టం..

కాగా, ఆ ప్రపంచకప్‌ సమయంలోనే శాస్త్రి తొలుత రెండేళ్ల కోచింగ్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది. అయితే, బీసీసీఐ దాన్ని మళ్లీ 45 రోజులకు.. ఆపై మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవ్వగా టీమ్ఇండియా వరుస విజయాలు సాధించింది. విండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై విజయఢంకా మోగించింది. ఇక కొవిడ్‌-19కు ముందు 2020 ఆరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనే కోహ్లీసేనకు షాకిచ్చింది. అక్కడ టెస్టు సిరీస్‌ కోల్పోయి ఇబ్బందులు పడింది. తర్వాత కరోనా లాక్‌డౌన్‌, ఆపై ఐపీఎల్‌ 2020 అనంతరం గతేడాది చివర్లో నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే, 2018-19 పర్యటనలో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ లాంటి కీలక ఆటగాళ్లు లేని సమయంలో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించిందనే విమర్శలకు చెక్‌ పెడుతూ టీమ్‌ఇండియా మరోసారి చారిత్రక ఘట్టం ఆవిష్కరించింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టాప్‌ జట్టుగా అడుగుపెట్టింది. అయితే, అక్కడ కూడా కోహ్లీసేన.. విలియమ్సన్‌ టీమ్‌ చేతిలో ఓటమిపాలై రెండోసారి ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. ఇలా కోహ్లీసేన.. రవిశాస్త్రి ఆధ్వర్యంలో బాగా ఆడినా రెండు ప్రధాన కప్పులను కోల్పోవడమే పెద్ద లోటుగా ఉంది. ఇప్పుడిక టీ20 ప్రపంచకప్‌ తర్వాత శాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తుండగా.. కోహ్లీ సైతం పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడు. దీంతో ఎలాగైనా ఈసారి ఐసీసీ కప్పును సాధించాలని వీరు పట్టుదలగా ఉన్నారు. మరి వారి కల నిజం అవుతుందో లేదో వేచి చూడాలి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

చివరగా వీరిద్దరి కాంబినేషన్‌లో గణాంకాలు పరిశీలిస్తే టీమ్‌ఇండియా మేటి ఫలితాలు సాధించిందనే చెప్పాలి. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లీసేన విజయాల శాతం ఇదివరకు ఏ కెప్టెన్‌-కోచ్‌కు సాధ్యంకాని రీతిలో ఉన్నాయి. ఈ 1983 ప్రపంచకప్‌ ఆల్‌రౌండర్‌ హెడ్‌కోచ్‌గా ఉన్న కాలంలో భారత్‌ మొత్తం 51 టెస్టులు ఆడగా అందులో 30 విజయాలు సాధించింది. అంటే విజయశాతం 58.80గా నమోదైంది. అంతకుముందు జాన్‌రైట్‌ కాలంలో భారత్‌ 52 టెస్టులాడి 21 విజయాలే సాధించింది. ఆ తర్వాతే 2011 ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్‌స్టెన్‌, డంకెన్‌ ఫ్లెచర్‌ ఉన్నారు. ఇక 91 వన్డే మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన 57 విజయాలతో 62.64 విజయశాతంతో కొనసాగుతోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని