Team India: టీమ్‌ఇండియా చారిత్రక విజయానికి మరింత విలువ..!

అదే ఆస్ట్రేలియా.. అదే మెల్‌బోర్న్‌ స్టేడియం. అదే బాక్సింగ్‌ డే టెస్టు. కానీ, గతేడాది భారత్‌ చెమటలు చిందింది గెలిచింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ దాసోహం అన్నట్లు ఓడింది....

Updated : 28 Dec 2021 13:40 IST

ఆసీస్‌ గడ్డపై బోర్లా పడ్డ ఇంగ్లాండ్‌..

అదే ఆస్ట్రేలియా.. అదే మెల్‌బోర్న్‌ స్టేడియం. అదే బాక్సింగ్‌ డే టెస్టు. కానీ, గతేడాది భారత్‌ చెమటలు చిందించి గెలిచింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ దాసోహం అన్నట్లు ఓడింది. అప్పుడు మెల్‌బోర్న్‌ టెస్టుకు ముందు అడిలైడ్‌లో టీమ్‌ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. అయినా.. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో అనూహ్య రీతిలో పుంజుకొని గొప్ప పోరాటపటిమను ప్రదర్శించింది. కానీ.. ఇప్పుడు యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ మెల్‌బోర్న్‌లోనూ మూడో ఓటమి చవి చూసి ఏకంగా సిరీస్‌నే కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా సాధించిన చారిత్రక విజయం.. అంత సులువు కాదని నిరూపితమైంది. మన అపురూప విజయానికి మరింత విలువ పెరిగింది.

అవమాన భారంతో మొదలై..

టీమ్‌ఇండియా ఆసీస్‌ పర్యటనలో ఆఖరి టెస్టుకు ముందు జట్టు పరిస్థితి మరీ ఘోరమనే చెప్పాలి. చాలామంది సీనియర్లు గాయాలతో దూరమైనా యువకులే పట్టుదలగా ఆడారు. కోహ్లీ లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌, నిఖార్సైన బౌలర్లే లేకపోయినా.. గబ్బా కోటలు బద్దలయ్యేలా విజయం సాధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ టెస్టుకు ముందు ఫిట్‌నెస్‌తో ఉన్న 11 మంది ఆటగాళ్లే టీమ్‌ఇండియాకు కరవయ్యారు. చివరికి నెట్‌బౌలర్స్‌గా వెళ్లిన యువకులు సైతం అనూహ్యంగా తుదిజట్టులోకి వచ్చి చారిత్రక విజయంలో తమవంతు పాత్ర పోషించారు. భారత్‌ తొలుత ఆడిన అడిలైడ్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై టెస్టు క్రికెట్‌లోనే అత్యల్ప స్కోర్‌ నమోదు చేశారు. తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. పట్లు సడలని దీక్షతో, అంకిత భావంతో మిగతా సిరీస్‌లో రాణించారు. ఎవరికి వారు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఘోర పరాభవం ఎదురైనా, సీనియర్లు దూరమైనా, గాయాల బెదడ బెంగపెడుతున్నా.. ఆసీస్‌ ఆటగాళ్లు కవ్విస్తున్నా.. గత మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా ఓటమే ఎరుగని గబ్బాలో ఆడుతున్నా.. మొక్కవోని పట్టుదల ప్రదర్శించారు. చివరికి సిరీస్‌ కైవసం చేసుకొని సగర్వంగా మువన్నెల జెండాను ఆసీస్‌ గడ్డపై రెపరెపలాడించారు.

సమష్టిగా రాణించి..

తొలి టెస్టులో భారత్‌ 36 పరుగులకే ఆలౌటయ్యాక.. కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగొచ్చాడు. రహానె, పుజారా, అశ్విన్‌, జడేజా మినహా జట్టులో అంతా యువకులే. అయినా రహానె మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో శతకంతో చెలరేగాడు. దీంతో భారత్‌ ఆ మ్యాచ్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో భారత్‌ దాదాపు ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 406 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు ఐదో రోజు మధ్యాహ్నానికి 312/6 స్కోర్‌తో కొనసాగుతోంది. ఒకటిన్నర సెషన్‌లో నాలుగు వికెట్లు తీస్తే ఆసీస్‌ గెలుపు. కానీ, అశ్విన్‌ (39; 128 బంతుల్లో 7x4), హనుమ విహారి(23; 161 బంతుల్లో 4x4) అసాధారణ పోరాటం చేశారు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్‌ చేశారు. చివరికి ఆసీస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును ఓటమి నుంచి తప్పించి డ్రాగా ముగించారు. దీంతో భారత్‌ సిరీస్‌లో వెనుకబడకుండా కాపాడారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఔటైనా పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇక చివరి టెస్టులో భారత విజయానికి ఆఖరి రోజు 324 పరుగులు కావాలి. రోహిత్‌ (7) విఫలమైనా గిల్‌ (91) రాణించాడు. రహానె (26) క్రీజులో నిలదొక్కుకోకపోయినా పుజారా (56) ఆదుకున్నాడు. రిషభ్‌ పంత్‌ (89) దూకుడు ప్రదర్శించాడు. చివరికి భారత్‌ విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో రెండోసారి భారత్‌ ఆస్ట్రేలియాలో కాలర్‌ ఎగరేసింది.

కుర్రాళ్లే కింగులు..

ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించింది కుర్రాళ్లే. గతంలో టెస్టు అనుభవం లేనివారు నేరుగా ఆస్ట్రేలియా గడ్డపైనే అరంగేట్రం చేసి నిర్భయంగా ఆడారు. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌ ఇలా ప్రతిఒక్కరూ రాణించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ప్రాణం పెట్టి ఆడారు. నాలుగో టెస్టులో సిరాజ్‌ మొత్తం 6 వికెట్లు తీసి (రెండో ఇన్నింగ్స్‌లో 5) కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అలాగే శుభ్‌మన్‌ గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. నటరాజన్‌ తనదైన యార్కర్లు, చక్కని బంతులతో తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు దక్కకున్నా పరుగులు నియంత్రించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండర్‌గా మెరిశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ (62, 22) మెచ్చుకోదగ్గ ప్రదర్శన చేశాడు. శార్దూల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే (67, 2) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలనే కసితో.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలనే ఆకాంక్షతో రగిలారు. చివరికి విజయం సాధించి అందరిచేతా శెభాష్‌ అనిపించుకున్నారు.

స్ఫూర్తి పొందుతామని చెప్పి..

ఇప్పుడు యాషెస్‌ గురించి మాట్లాడితే అదే ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్‌ కనీస పోరాటం చేయకుండా బొక్క బోర్లా పడుతోంది. తాజాగా మెల్‌బోర్న్‌ టెస్టులో ఇన్నింగ్స్‌ 15 పరుగులతో ఓటమిపాలై ఏకంగా సిరీస్‌నే కోల్పోయింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఆ జట్టు సారథి జోరూట్‌.. ఇక్కడ టీమ్‌ఇండియా సాధించిన విజయాన్ని చూసి స్ఫూర్తిపొందుతామని చెప్పాడు. అయితే.. ఆశించిన మేర ప్రదర్శన చేయలేక ఆ జట్టు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే యాషెస్‌ను కోల్పోయింది. ఈ ఇంగ్లిష్‌ జట్టులో రూట్‌, డేవిడ్‌ మలన్‌ మినహా ఎవ్వరూ అంతగా రాణించడం లేదు. మరోవైపు ఆసీస్‌ ఆటగాళ్లు సమయోచితంగా ఆడుతూ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు రెండో టెస్టును 275 పరుగుల భారీ తేడాతో కైవసం చేసుకున్నారు.

అదే తేడా..

చివరగా టీమ్‌ఇండియా విజయాలు సాధించడానికి.. ఇంగ్లాండ్‌ ఓటములు చవిచూడడానికి ప్రధాన కారణం సమష్టితత్వమే. భారత జట్టులో అప్పుడు చాలా మంది యువకులు ఆ పర్యటనలోనే అరంగేట్రం చేసినా పట్టుదలతో, కసితో, అంకితభావంతో ఆడారు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ జోరూట్‌, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా రాణించగల సత్తా ఉన్న డేవిడ్‌ మలన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌..స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, క్రిస్‌వోక్స్‌ లాంటి ప్రపంచ శ్రేణి బౌలింగ్‌ దళం కూడా ఆసీస్‌ గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనైనా విజయాలు సాధించి మరింత అవమాన భారాన్ని మూటగట్టుకోకుండా వెళ్లాలని ఆశిద్దాం.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని