
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ముందు ఎవరెలా ఉన్నారంటే..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియా తొలి విజేత. తర్వాత మరో పొట్టి కప్పు సాధించాలని చూసినా కుదరలేదు. 2014లో ఆ అవకాశం దక్కినా ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలై త్రుటిలో ఆ సువర్ణ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో అప్పటి నుంచి మరో ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కల అలాగే ఉండిపోయింది. చివరిసారి 2016లో ఫేవరెట్‌గా బరిలోకి దిగినా టీమ్ఇండియా సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆపై వివిధ కారణాలతో ఐదేళ్లుగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు వీలుకాలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారైనా కప్పు గెలవాలని అటు ‘కోహ్లీసేన’ ఇటు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ ఐపీఎల్ 2021లో ఆడారు. మరి ఎవరెవరెవరు ఎలా రాణించారో, ఎలా విఫలమయ్యారో పరిశీలిస్తే..
విరాట్ కోహ్లీ: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరిసారి ఫర్వాలేదనిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేక మరోసారి నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో అప్పుడప్పుడు మెరిసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బెంగళూరు లీగ్ దశలో వరుస విజయాలతో రాణించి ప్లేఆఫ్స్‌లో కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో బోల్తాపడింది. ఇక్కడ కోహ్లీ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 3 అర్ధశతకాలతో 405 పరుగులు చేశాడు. సగటు 28.92గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్ 119.46 సాధించాడు. అయితే, ప్రపంచకప్‌లో భారత్ గెలవాలంటే ఇలాంటి ప్రదర్శన సరిపోదు. కెప్టెన్ మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది.
రోహిత్ శర్మ: ముంబయి కెప్టెన్‌గా ఓపెనర్ రోహిత్ శర్మ సైతం ఏమంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 13 మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధశతకాలతో 381 పరుగులు చేశాడు. అతడి సగటు 29.30గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్ 127.42గా ఉంది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో ఎ జట్టుకైనా ఓపెనర్లే కీలకం కాబట్టి.. ఈ హిట్‌మ్యాన్ చెలరేగకపోతే భారత్‌కు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు. అతడు రాణించాలంటే 2019 వన్డే ప్రపంచకప్ ఆటను గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ టోర్నీలో రోహిత్ ఐదు శతకాలతో రాణించి వన్డే ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్ మరోసారి అలాంటి ప్రదర్శన చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కేఎల్ రాహుల్: ఈ ఐపీఎల్ మొత్తంలో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌లో ఎవరైనా అదరగొట్టారా అంటే అది కేఎల్ రాహుల్ అని కచ్చితంగా చొప్పొచ్చు. ఈ పంజాబ్ కెప్టెన్ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లకపోయినా తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తన ఆటతో బౌలర్ల దుమ్ముదులిపాడు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 62.60 సగటుతో 626 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక స్ట్రైక్‌రేట్ కూడా 138.80 మెరుగ్గా ఉంది. ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో పంజాబ్ కెప్టెన్ టాప్-3లో నిలిచాడు. ప్రపంచకప్‌లోనూ అతడిలాగే చెలరేగితే భారత్ భారీ స్కోర్లు సాధించగలదు.
సూర్యకుమార్ యాదవ్: గత కొన్నాళ్లుగా ముంబయి ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికైన అతడు తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, ఐపీఎల్లో విఫలమవ్వడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సీజన్లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 22.64 సగటుతో రెండు అర్ధశతకాల సాయంతో 317 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 143.43 బాగున్నా కీలక మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి మ్యాచ్‌లో 80కి పైగా పరుగులు సాధించాడు. అతడిలా రాణిస్తే టీమ్ఇండియాకు ఎంతో ఉపయోగం.
రిషభ్ పంత్: ఈ సీజన్లో అనూహ్యంగా దిల్లీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన రిషభ్ పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ప్లేఆఫ్స్‌లో రెండు ఓటములు మినహాయిస్తే దిల్లీ అదిరిపోయే ప్రదర్శన చేసిందనే చెప్పాలి. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఆకట్టుకుంటూనే పంత్ బ్యాటింగ్‌లోనూ తనదైన ముద్రవేశాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతడు మూడు అర్ధశతకాలతో 419 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఫర్వాలేదనిపించే 34.91 సగటుతో మెరిశాడు. మొత్తంగా పంత్ ఫామ్‌లో ఉండటం టీమ్ఇండియాకు లాభం చేకూర్చేదే. అయితే, కీలక సమయాల్లో అతడు మరింత ధాటిగా ఆడటంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి.
ఇషాన్ కిషన్: సూర్యకుమార్ లాగే ఈ యువ ఆటగాడు కూడా ఈ ఏడాదే టీమ్ఇండియాలో రంగ ప్రవేశం చేశాడు. అయితే, ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాన్ కిషన్ చివర్లో రెండు మ్యాచ్‌ల్లో ఉతికారేశాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. దీంతో ఈ ముంబయి బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి తిరిగొచ్చినట్లే. ఇక ఈ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్.. రెండు అర్ధశతకాలతో 241 పరుగులు చేశాడు. అందులో సగటు 26.77 నమోదవ్వగా స్ట్రైక్‌రేట్ కూడా 133.88 బాగుంది. అతడిలాగే చెలరేగితే టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ కష్టాలు తీరినట్లే.
హార్దిక్ పాండ్య: టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్య ఇదివరకు నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. అయితే, 2019లో వెన్ను భాగంలో శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో బంతి ముట్టుకోలేదు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ హార్దిక్ ఈ సీజన్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 14.11 సగటుతో 127 పరుగులే చేశాడు. ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం గమనార్హం. అయితే, అనుభవం రీత్యా ఈ స్టార్ ఆల్‌రౌండర్ తుదిజట్టులో ఉండే అవకాశాలున్నా కనీసం బ్యాట్‌తోనైనా మెరుపులు మెరిపించాలి.
రవీంద్ర జడేజా: ఈ సీజన్లో చెన్నై ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌తో, ఇటు బౌలింగ్‌తో రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన జడేజా 75.66 అద్భుతమైన సగటుతో 227 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లోనూ 7.06 ఎకానమీతో చాలా పొదుపుగా బంతులేసి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమ్ఇండియా ప్రపంచకప్ జట్టులో జడ్డూని లేకుండా ఊహించలేం. అతడిలాగే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తే టీమ్ఇండియాకు బాగా ఉపయోగపడతాడు.
రాహుల్ చాహర్: ఈ ఐపీఎల్లో తొలుత మెరిసి తర్వాత తేలిపోయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ అనే చెప్పాలి. భారత్‌లో జరిగిన తొలి భాగంలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసిన అతడు తర్వాత యూఏఈలో జరిగిన రెండో దశలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో లీగ్ చివరి దశలో జట్టులోనే స్థానం కోల్పోయాడు. మొత్తంగా ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన ముంబయి స్పిన్నర్ 7.39 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేసినా 13 వికెట్లు తీశాడు. యూఏఈ పిచ్‌లపై రాణించకపోవడంతో ప్రపంచకప్‌లో తుదిజట్టులో అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
శార్దూల్ ఠాకూర్: ఈ చెన్నై ఆల్‌రౌండర్ అనుకోని పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీమ్ఇండియా ప్రపంచకప్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సెలెక్షన్ కమిటి అక్షర్ పటేల్‌ను స్టాండ్‌బై ఆటగాడిగా మార్చి శార్దూల్‌ను ఎంపిక చేసింది. అందుకు కారణం ఈ ఐపీఎల్లో అతడు పేస్ బౌలర్లకు దీటుగా రాణించడమే. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 8.80 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే కోల్‌కతాతో ఆడిన ఫైనల్లో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. అయితే, బ్యాటింగ్ పరంగా శార్దూల్‌కు అవకాశాలు రాలేదు.
రవిచంద్రన్ అశ్విన్: ఈ ఐపీఎల్లో దిల్లీ ప్రధాన స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన సీనియర్ స్పిన్నర్ 7.41 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ల పరంగా విఫలమయ్యాడు. అతడిపై భారీ అంచనాలున్నా ఏడు వికెట్లే తీసి నిరాశపరిచాడు. కానీ, భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన అశ్విన్ తిరిగి చాలాకాలం తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే, తుది జట్టులో అశ్విన్‌ను తీసుకుంటారా లేదా అనేది కీలకంగా మారనుంది.
భువనేశ్వర్ కుమార్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ప్రధాన పేసర్‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో ఏమాత్రం రాణించలేదు. 11 మ్యాచ్‌లు ఆడి కేవలం ఆరు వికెట్లే తీసి విఫలమయ్యాడు. అయినా, అతడిపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు జట్టు సభ్యుల్లో ఒకడిగా ఎంపిక చేశారు. అయితే, ఈ ప్రపంచకప్‌లో మొత్తం నలుగురు పేసర్లనే ఎంపిక చేయడంతో భువి కన్నా.. శార్దూల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు శార్దూల్ ఈ ఐపీఎల్లో ప్రధాన పేసర్లకు దీటుగా వికెట్లు తీశాడు.
జస్ప్రిత్ బుమ్రా: కొంతకాలంగా టీమ్ఇండియాలో వికెట్లు తీయలేక ఇబ్బందులు పడిన ముంబయి ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఐపీఎల్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 21 వికెట్లు తీశాడు. దీంతో పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఈ సీజన్లో అతడి ఎకానమీ సైతం 7.45 ఆకట్టుకునేలా ఉంది. దీంతో ప్రపంచకప్‌లోనూ బుమ్రా రాణిస్తే ప్రత్యర్థులకు గుబులే. డెత్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థులను చిత్తుచేయగల బుమ్రా ఈసారి జట్టును విజయతీరాలకు చేర్చాలి.
మహ్మద్ షమి: ఇక పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసర్‌గా ఉన్న మహ్మద్ షమి టీమ్ఇండియాలోనూ కీలక బౌలరే. పంజాబ్ ఈ సీజన్లో మెరవకపోయినా ఎప్పటిలాగే షమి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 7.50 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేసి 19 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రాతో కలిసి షమి ప్రపంచకప్‌లో రాణిస్తే టీమ్ఇండియాకు ఎదురుండదు.
వరుణ్ చక్రవర్తి: కోల్‌కతా జట్టులో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరు కొంత కాలంగా బాగా వినిపిస్తోంది. మణికట్టు స్పెషలిస్టుగా ఈ ఏడాది టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న అతడు ఈసారి ఏకంగా ప్రపంచకప్‌పైనే గురిపెట్టాడు. ఈ సీజన్లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ 6.58 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 18 వికెట్లు తీశాడు. దాంతో ఆ జట్టు ఫైనల్ వరకూ దూసుకెళ్లడంలో తనవంతు కృషి చేశాడు. ప్రపంచకప్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఆడే అవకాశం రావచ్చనే అభిప్రాయం బలంగా ఉంది.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం