Team India: కృనాల్‌, చాహల్‌, కృష్ణప్పను వదిలేసొచ్చిన టీమ్‌ఇండియా

శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం అక్కడికి వెళ్లిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, కరోనా వైరస్‌ బారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయారు...

Updated : 20 Sep 2022 15:34 IST

ఇంగ్లాండ్‌కు పయనంకానున్న సూర్యకుమార్‌, పృథ్వీ షా

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం అక్కడికి వెళ్లిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, కరోనా వైరస్‌ బారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం వారు ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్నారు. టీమ్‌ఇండియా గురువారమే మూడు టీ20ల సిరీస్‌ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు శుక్రవారం భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యే ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో యుజువేంద్ర చాహల్‌, కృష్ణప్ప గౌతమ్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో వారు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇక రెండో టీ20కి ముందు తొలుత కృనాల్‌ పాండ్యకు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అతడితో సన్నిహితంగా మెలిగిన మరో ఎనిమిది ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారు. అందులో చాహల్‌, కృష్ణప్ప సైతం ఉన్నారు. వారికి వైరస్‌ సోకిందని తెలుస్తోంది. కాగా, వీరంతా బుధ, గురువారాల్లో జరిగిన రెండు టీ20ల్లో పాల్గొనలేదు. కీలక ఆటగాళ్లంతా లేకపోవడంతో అనుభవం లేని యువకులు శ్రీలంక చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇక కృనాల్‌కు కరోనా సోకాక ఐసోలేషన్‌లోకి వెళ్లిన ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్య, మనీశ్‌ పాండే, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా, దీపక్‌ చాహర్‌కు నెగిటివ్‌గా తేలడంతో వారంతా తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు.

నాటింగ్‌హామ్‌కు సూర్య, పృథ్వీ..

మరోవైపు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్‌ఇండియాలో అవేశ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో వారి స్థానాల్లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన పృథ్వీ, సూర్యకుమార్‌ను భర్తీ చేయాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ నేరుగా నాటింగ్‌హామ్‌కు బయలుదేరనున్నారు. అక్కడ చేరుకున్నాక కొద్దిరోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండి ఆపై జట్టుతో కలవనున్నారు. ఇక కోహ్లీసేన నేటితో తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను పూర్తి చేసుకుంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని