Published : 20 Jul 2021 01:54 IST

INDvsSL: రెండో వన్డేలోనే శ్రీలంక పనిపట్టాలి..! 

సత్తా చాటుతున్న టీమ్ఇండియా యువకులు...

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువకులు సత్తా చాటారు. శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో ఘన విజయం సాధించారు. దాంతో మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ ఇలాగే చెలరేగి.. రేపే సిరీస్‌ కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత యువకులు దంచికొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా ఛేదించారు. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో బోణికొట్టి ఆధిపత్యం చెలాయించారు.

పటిష్టమైన బ్యాటింగ్‌..

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(86*)తో పాటు యువ ఆటగాళ్లు పృథ్వీ షా(43), ఇషాన్‌ కిషన్‌(59), సూర్యకుమార్‌ యాదవ్‌(31*) చెలరేగిపోయారు. లంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొని స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పృథ్వీ, ఇషాన్‌ దూకుడుగా ఆడారు. పృథ్వీ భారీ స్కోర్‌ సాధించకపోయినా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దాంతో అతడు మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మనీశ్‌ పాండే (40 బంతుల్లో 26 పరుగులు) ఒక్కడే కాస్త నెమ్మదిగా ఆడి ప్రభావం చూపలేకపోయాడు. ఇది మినహాయిస్తే భారత బ్యాటింగ్‌ లైనప్‌ మొత్తం పటిష్టంగా ఉంది.

కుదురుకున్న స్పిన్‌ విభాగం..

ఇక బౌలింగ్‌ విభాగంలో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కలిసి ఆడిన చాహల్‌, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. మరోవైపు హర్దిక్‌ పాండ్య సైతం 5 ఓవర్లు బౌలింగ్‌ చేసి కట్టుదిట్టంగా బంతులేశాడు. ఈ క్రమంలోనే కృనాల్‌ పాండ్య కూడా పొదుపుగా బౌలింగ్‌ చేసి లంక పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. అయితే, సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డాడు. అతడు తర్వాతి మ్యాచ్‌లో రాణించాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా రెండో వన్డేలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని చూస్తోంది.

లంక కోలుకోవాల్సిందే..

మరోవైపు శ్రీలంక జట్టులోని చాలా మంది బ్యాట్స్‌మెన్‌ తొలుత బాగా ఆడారు. అనేక మంది మంది శుభారంభాలు చేసినా పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో తమలో పోరాడే సత్తా ఉందని చెప్పకనే చెప్పారు. చామిక కరుణరత్నె (43), కెప్టెన్‌ దాసున్‌ షనక (39), అసలంక (38), అవిష్క ఫెర్నాండో (33) ఉన్నంతసేపు మంచి పరుగులు చేశారు. వీళ్లంతా మరింత దూకుడుగా ఆడితే ఆ జట్టు ఇంకా మెరుగైన స్కోరు సాధిస్తుందనడంలో సందేహం లేదు. కరుణరత్నె కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. తమ జట్టులోని కొంతమంది ఎక్కువసేపు క్రీజులో నిలిచి ఉంటే బాగుండేదన్నాడు. దాంతో తర్వాత భారీ షాట్లు ఆడి స్కోరుబోర్డుపై 300లకు పైగా పరుగులు సాధించేవాళ్లమని చెప్పాడు. కాగా, లంక బౌలింగ్‌ విభాగం ఒక్కటే బలహీనంగా కనిపించింది. ధనంజయ రెండు వికెట్లు తీసినా ఐదు ఓవర్లకు సుమారు 50 పరుగులిచ్చాడు. మిగతా బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. చమీరా, హసరంగా మాత్రమే పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో టీమ్‌ఇండియా బ్యా్ట్స్‌మెన్‌ను అడ్డుకోవాలంటే లంక బౌలర్లు కష్టపడాల్సిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని