Ravi shastri: ఆట అప్పుడే అయిపోయిందనుకోవద్దు..! ఇప్పటికీ గెలవగలం అంటున్న రవిశాస్త్రి

ఇంగ్లాండ్‌ సిరీసు గెలిచేందుకు టీమ్‌ఇండియాకు ఇంకా అవకాశాలు ఉన్నాయని కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. మూడో టెస్టు పరాజయాన్ని మర్చిపోవాలని సూచించాడు....

Published : 02 Sep 2021 10:47 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ సిరీసు గెలిచేందుకు టీమ్‌ఇండియాకు ఇంకా అవకాశాలు ఉన్నాయని కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. మూడో టెస్టు పరాజయాన్ని మర్చిపోవాలని సూచించాడు. లార్డ్స్‌ టెస్టు అద్భుతాన్ని ప్రేరణ తీసుకోవాలని వెల్లడించాడు. అతడి కొత్త పుస్తకం ‘స్టార్‌ గేజింగ్‌’ ప్రమోషన్‌ కార్యక్రమంలో శాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

‘ఇదెంతో తేలిక. లార్డ్స్‌ నుంచి మళ్లీ మొదలు పెట్టాలి. ఆ విజయాన్ని గుర్తుపెట్టుకొని మూడో టెస్టు పరాజయం మర్చిపోవాలి. చెప్పడం కన్నా చేయడం కష్టమని నాకు తెలుసు. కానీ, మనం మంచి సందర్భాలను నెమరు వేసుకోవాలి. ఓటములు ఆటలో సహజమే కదా’ అని రవిశాస్త్రి అన్నాడు.

ఆటకు ముందు సానుకూలంగా ఆలోచించాలని శాస్త్రి తెలిపాడు. లార్డ్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఐదో రోజు అద్భుతం చేసిన సంగతిని గుర్తుచేశాడు. ‘నిజానికి రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆధిపత్యం చలాయిస్తోంది. కానీ, కోహ్లీసేన విజయం లాగేసుకుంది. ఇక చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. తొలిరోజే మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. మమ్మల్ని వెనకడుగు వేసేలా చేసింది’ అని ఆయన వెల్లడించాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైనా రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బాగానే పుంజుకుందని శాస్త్రి అన్నాడు. ‘నిజానికి మేం రెండో ఇన్నింగ్స్‌లో పోరాడాం. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటయ్యాం. కానీ, ఈ సిరీసులో ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.

ఎవరైనా ఈ భారత జట్టును తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులని రవిశాస్త్రి వెల్లడించాడు. సిరీసు 1-1తో సమమైనా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. ‘సొంతగడ్డపై గెలవాలన్న తపన ఇంగ్లాండ్‌కు ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో మేమదే చేశాం. బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. సిరీస్‌ కోసం వారు పోరాడరని చెప్పడంలో సందేహం లేదు’ అని శాస్త్రి తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని