Virat Kohli: వన్డే కెప్టెన్సీ మార్పు .. కోహ్లీకే మంచిది: సౌథీ

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ ప్రశంసలు కురిపించాడు. అతడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదని చెప్పాడు...

Updated : 21 Dec 2021 12:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ ప్రశంసలు కురిపించాడు. అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం మంచిదే అని చెప్పాడు. తాజాగా ఓ ఓటీటీలో మాట్లాడిన సౌథీ కోహ్లీ కెప్టెన్సీ వివాదంపై స్పందించాడు.

‘టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉంటే ఎదురయ్యే పరిస్థితులు, ఒత్తిడి ఏంటో నాకు తెలియదు. అది కేవలం భారత క్రికెట్‌కే కాకుండా ఐపీఎల్‌లోనూ అర్థంకాని పరిస్థితి. కోహ్లీ సారథిగా కొన్నేళ్లపాటు రాణించాడు. ఓ వైపు ఆటతో, మరోవైపు కెప్టెన్‌గా రాణించడం కోహ్లీ అభిమానులకు నచ్చుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండటం అతడిపై భారం తగ్గిస్తుంది. అతడు ఆడినన్ని రోజులు జట్టుకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోహ్లీ అలాంటి వ్యక్తి. ఆర్సీబీలో కొత్త సారథికి, టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మకు విరాట్‌ తన సహకారం అందించి ఆయా జట్లను ముందుకు తీసుకెళ్తాడు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు ఎప్పుడూ ఆట పట్ల అంకితభావంతో ఉంటూ జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడు’ అని సౌథీ చెప్పుకొచ్చాడు.

ఇక విరాట్‌ కోహ్లీ గత రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేకపోవడంపై స్పందిస్తూ.. ఎవరైనా అతడిలా ఆడితే, అతడు సాధించినన్ని పరుగులు చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చెప్పాడు. చివరగా కోహ్లీ.. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై మాట్లాడుతూ.. అతడిలాంటి ఆటగాడికి బౌలింగ్‌ చేయడం తమ అదృష్టమని అన్నాడు. అయితే, కైల్‌ జేమీసన్‌ అతడికి బాగా బౌలింగ్‌ చేస్తాడన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని