
Tokyo Olympics: అయ్యో దీపికా.. హాకీ ఆశలు సజీవం
ఒలింపిక్స్‌లో తాజా విశేషాలు
టోక్యో: విశ్వ క్రీడల్లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల ఆర్చరీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. కనీస పోరాటం లేకుండా కొరియా టాప్‌సీడ్ యాన్‌సాన్ చేతిలో 6-0 తేడాతో ఓటమిపాలైంది. దాంతో మహిళల ఆర్చరీ విభాగంలో పతకం ఖాయమని భావించినప్పటికీ చేదు అనుభవమే మిగిలింది. ఈ మ్యాచ్ కేవలం ఆరు నిమిషాల్లో పూర్తవడం గమనార్హం. దీపిక గత మూడు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నా ఒక్కసారి కూడా పతకం ముద్దాడలేకపోయింది.
తొలుత 2012 లండన్ ఒలింపిక్స్‌లో నంబర్ వన్ ర్యాంకర్‌గా అడుగుపెట్టిన ఆమె తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఆపై 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ప్రీ క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ వరకూ చేరి ఆశలు రేపింది. ఈ క్రమంలోనే ఓటమి పాలైంది. మరోవైపు ఆర్చరీ విభాగంలో భారత్‌కు మిగిలి ఉన్న ఏకైక ఆశాదీపం దీపిక భర్త అతాను దాస్ మాత్రమే. పురుషుల విభాగంలో అతడు గురువారం ప్రీక్వార్టర్స్‌లో విజయం సాధించాడు. రెండుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన జిన్ హైక్‌ను ఓడించి శనివారం జపాన్ అథ్లెట్ తకాహరు ఫురుకవాతో క్వార్టర్స్‌లో పోటీపడనున్నాడు.
ఆశలు నిలబెట్టిన నవ్‌నీత్ కౌర్..
ఇక టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శనివారం పెనల్టిమేట్ పూల్‌లోతప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 1-0 తేడాతో గెలుపొందింది. ఆది నుంచి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే భారత్‌కు 14 పెనాల్టీ కార్నర్స్ అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి రెండు క్వార్టర్స్‌లో గట్టిపోటీ ఇచ్చిన భారత జట్టు మూడో క్వార్టర్స్‌లో కాస్త నెమ్మదించింది. అయితే, చివరి క్షణాల్లో 57వ నిమిషంలో నవ్‌నీత్ గోల్ కొట్టేందుకు సరైన స్థానంలో ఉండగా కెప్టెన్ రాణిరామ్‌పాల్ సరైన షాట్‌తో సహకరించింది. అలా చివరికి నవ్‌నీత్ గోల్ సాధించి భారత్‌ను గెలిపించింది. కాగా, ఈ మ్యాచ్ కన్నా ముందు భారత మహిళల జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలైంది. దాంతో ఇది తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి భారత్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్ ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు భారత జట్టు క్వార్టర్స్‌కు వెళ్లాలంటే శనివారం జరిగే పూల్-ఏ విభాగంలో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంది. అలాగే ఐర్లాండ్.. బ్రిటన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంది. ఈ రెండూ జరిగితే భారత అమ్మాయిలు క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంటారు.