Tokyo Olympics: డిస్కస్‌ త్రోలో విఫలమైన కమల్‌ప్రీత్‌కౌర్‌

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌కు...

Updated : 02 Aug 2021 19:30 IST

ఆరో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్‌

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కమల్‌ప్రీత్‌ శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో 64 మీటర్లతో అత్యద్భుత ప్రదర్శన చేసింది. దాంతో ఫైనల్స్‌లోనూ ఆమె ఇలాగే మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశించినా చివరికి నిరాశపర్చింది. కనీసం సెమీ ఫైనల్స్‌లో సాధించిన 64 మీటర్ల ప్రదర్శనను కూడా అందుకోలేకపోయింది. మొత్తం ఆరుసార్లు డిస్కస్‌ త్రో చేసిన కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో 63.70 మీటర్లతో నిలిచింది. దాంతో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక అమెరికా అథ్లెట్‌ అల్మన్‌ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్ల మేటి ప్రదర్శనతో అందరికన్నా ముందే స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. తర్వాతి ప్రయత్నాల్లో ఆమె విఫలమైనా చివరి వరకూ అదే అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. దాంతో అమెరికా అథ్లెట్‌ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జర్మనీ అథ్లెట్‌ పుడెన్జ్‌ క్రిస్టిన్‌ ఐదో ప్రయత్నంలో 66.86 మీటర్ల మెరుగైన ప్రదర్శన చేసి రజతం పట్టేసింది. ఆపై క్యూబా అథ్లెట్‌ పెరెజ్‌ యామి తొలి ప్రయత్నంలో సాధించిన 65.72 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. దాంతో ఆమె కాంస్యం చేజిక్కించుకుంది. కాగా, ఈ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత కోచ్‌ లేకుండానే పోరాడిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ తుదిపోరులో ఒత్తిడికి గురైంది. దాంతో ఆత్మవిశ్వాసం లోపించి సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మరోవైపు ఈ విశ్వక్రీడలు ఆమెకు రెండో అంతర్జాతీయ ఈవెంట్‌ కావడం గమనార్హం. ఇదివరకు 2017లో ఒక్కసారి మాత్రమే ప్రపంచ యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొనింది. అయినా, సెమీస్‌లో 64 మీటర్ల ప్రదర్శన చేసి భారత్‌కు మరో పతకం ఖాయం చేసేలా కనిపించింది. కానీ, తుదిపోరులో ఎంత ప్రయత్నించినా పతకం సాధించలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని