Tokyo Olympics: ఆటలో ఓడినా.. స్ఫూర్తి రగిలించారు..!

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ టోక్యో ఒలింపిక్స్‌ ఘనంగా జరిగాయి. ఈ విశ్వక్రీడలు పలువురు భారత అథ్లట్లకు తీపి జ్ఞాపకాలు అందించగా మరికొందరికి అంతులేని దుఖాఃన్ని మిగిల్చాయి...

Published : 09 Aug 2021 10:31 IST

ఒలింపిక్స్‌లో అంచనాలు అందుకోలేక చివరి నిమిషంలో..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ టోక్యో ఒలింపిక్స్‌ ఘనంగా జరిగాయి. ఈ విశ్వక్రీడలు పలువురు భారత క్రీడాకారులకు తీపి జ్ఞాపకాలు అందించగా మరికొందరికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చాయి. మొత్తం 127 మంది అథ్లెట్లతో వివిధ పోటీల్లో తలపడిన భారత్‌ ఏడు పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ విషయం పక్కనపెడితే టోక్యో ఒలింపిక్స్‌లో మరికొంత మంది అథ్లెట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేసినా దురదృష్టవశాత్తూ ఓటమిపాలై త్రుటిలో పతకాలు కోల్పోయారు. వాళ్లంతా ఏదో ఒక పతకం సాధిస్తారని ఆశించినా చివరికి ఖాళీ చేతులతో తిరిగొచ్చారు. ఒకవేళ వీళ్లు కూడా ఆయా పోటీల్లో గెలిచి ఉంటే భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయమయ్యేవే. అలా చివరి క్షణాల్లో పతకాలు కోల్పోయిన వారెవరో చూద్దాం... 

* అదితి అశోక్‌ (గోల్ఫ్‌): ఎవరూ ఊహించని రీతిలో భారత గోల్ఫర్‌ అదితి అశోక్‌ విశేషంగా రాణించింది. చివరి క్షణాల్లో ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆమె అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాప్‌ ప్లేయర్లను కూడా వెనక్కినెడుతూ ఫైనల్‌ వరకూ చేరుకుంది. దాంతో పతకంపై ఆశలు పెంచిన అదితి దురదృష్టవశాత్తు నాలుగో స్థానానికి పరిమితమైంది.

* మహిళల హాకీ జట్టు: భారత మహిళల హాకీ జట్టు ఎన్నడూలేని విధంగా ఒలింపిక్స్‌లో ఈసారి అత్యద్భుత ప్రదర్శన చేసింది. దీంతో తొలిసారి సెమీస్‌కు చేరుకొని అక్కడి నుంచి వెనుదిరిగింది. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైన రాణీ రామ్‌పాల్‌ జట్టు తర్వాత కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. అయితే, వీళ్లు ఓడిపోయినా దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగింది.

* కమల్‌ప్రీత్‌ కౌర్‌ (డిస్కస్‌ త్రో): మహిళల డిస్కస్‌త్రో విభాగంలో ఏదో ఒక పతకం ఖాయమని ఆశించిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కమల్‌.. సెమీఫైనల్స్‌లో 64 మీటర్లతో అత్యద్భుత ప్రదర్శన చేసింది. దీంతో ఫైనల్లోనూ అలాంటి ప్రదర్శనే చేస్తుందని ఆశించినా చివరికి సెమీఫైనల్‌ మార్కును కూడా అందుకోలేకపోయింది.

* వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లింగ్‌): మహిళల రెజ్లింగ్‌ 53 కేజీల విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన వినేశ్‌ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వనెసా చేతిలో 9-3తో ఓటమిపాలైనా ఆమెకు రెపిఛేజ్‌ పద్ధతిలో కాంస్య పోరు అవకాశం ఉండేది. కానీ, అదీ జరగలేదు. సెమీస్‌లో చైనాకు చెందిన కియాన్యు పాంగ్‌ను వనెసా ఓడించి ఉంటే వినేశ్‌ కాంస్య పోరులో తలపడేది. దాంతో కనీసం కంచు పతకమైనా వినేశ్‌కు దక్కే వీలుండేది.

* అతాను దాస్‌ (ఆర్చరీ): ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఏదో ఒక పతకం సాధిస్తాడని అంచనాలు పెట్టుకున్న అతాను దాస్‌ ప్రిక్వార్టర్స్‌ నుంచే నిష్క్రమించాడు. అక్కడ జపాన్‌ ఆర్చర్‌ తాకాహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలై నిరాశపరిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఫురుకవా స్వల్ప తేడాతో ఆధిక్యం సంపాదించి ముందుకు దూసుకెళ్లడంతో అతాను ఆశలు గల్లంతయ్యాయి.

* దీపికా కుమారి (ఆర్చరీ): మహిళల ఆర్చరీ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఈ పోటీలో కనీస పోరాటం లేకుండానే కొరియా టాప్‌సీడ్‌ యాన్‌సాన్‌ చేతిలో 6-0 తేడాతో ఓటమిపాలైంది. దీంతో మహిళల ఆర్చరీ విభాగంలో పతకం ఖాయమని భావించినప్పటికీ చేదు అనుభవమే మిగిలింది. దీపిక గత మూడు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నా ఒక్కసారీ పతకం సాధించకపోవడం గమనార్హం.

* సతీశ్‌ కుమార్‌ (బాక్సింగ్‌): పురుషుల 91+ కేజీల క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ సైతం పతకం కోల్పోయాడు. ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ జలొలోవ్‌ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు పురుషుల 52 కేజీల విభాగంలో భారీ అంచనాలు పెట్టుకున్న అమిత్‌ పంగల్‌ సైతం నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లోఅతడు యుబెర్జెన్‌ మార్టినెజ్‌ చేతిలో 1-4 తేడాతో విఫలమయ్యాడు.

* ఫవాద్‌ (ఈక్విస్ట్రియన్‌): రెండు దశాబ్దాల తర్వాత ఈక్వెస్ట్రియన్‌ పోటీల్లో తలపడిన తొలి భారత రైడర్‌ ఫవాద్‌ మీర్జా ఫైనల్‌కు దూసుకెళ్లి భారీ అంచనాలు సృష్టించాడు. తొలి రెండు రౌండ్లు అయిన డ్రెస్సెజ్‌, క్రాస్‌కంట్రీ పోటీల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన అతడు ఏదో ఒక పతకం సాధించేలా కనిపించాడు. అయితే కీలకమైన తుదిపోరులో పూర్తిగా తేలిపోయి 23వ స్థానంలో నిలిచాడు.

* అన్ను రాణి (జావెలిన్‌ త్రో): మహిళ జావెలిన్‌ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో భారత అథ్లెట్‌ అన్ను రాణి నిరుత్సాహపర్చింది. ఆమె మూడో ప్రయత్నంలో 54.04 మీటర్ల ప్రదర్శన చేసి క్వాలిఫికేషన్‌-ఏలో 14వ స్థానంలో నిలిచింది. దీంతో మార్చిలో ఆమె నెలకొల్పిన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 63.24 మీటర్లు కూడా చేరుకోలేకపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు