Tokyo olympics: పసివాడి హృదయం కోసం ఒలింపిక్‌ పతకాన్నే వేలం వేసింది

ఒలింపిక్స్‌లో ఆమె సాధించింది రజతం.. కానీ ఆమె మనసు బంగారం! కొన్నేళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలాన్ని త్యాగం చేసేందుకు వెనుకాడని స్త్రీమూర్తి ఆమె...

Published : 19 Aug 2021 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌లో ఆమె సాధించింది రజతం.. కానీ, ఆమె మనసు బంగారం! కొన్నేళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలాన్ని త్యాగం చేసేందుకు వెనుకాడని స్త్రీమూర్తి ఆమె! ఎనిమిది నెలల పసివాడి గుండె కోసం పతకాన్ని వేలానికి పెట్టిన సహృదయం తనది! ఆమే పోలండ్‌ అథ్లెట్‌ మరియా ఆండ్రెజిక్‌.

టోక్యో ఒలింపిక్స్‌లో మరియా రజతం పతకం గెలుచుకుంది. జావెలిన్‌ను 64.61 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఆమె రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. అందుకే ఆమెకీ టోక్యోలో లభించిన పతకం ఎంతో ప్రత్యేకం. ఐదేళ్ల కఠిన శ్రమకు ప్రతిఫలం. అందుకే దానిని ఎవరైనా అపురూపంగా దాచుకుంటారు.

అలాంటిది.. ఓ ఎనిమిది నెలల పసికందు గుండెకు సమస్య ఏర్పడిందని తెలిసి మరియా తల్లడిల్లింది. తనకు తోచిన సాయం చేయాలనుకుంది. శస్త్రచికిత్స కోసం ఆ చిన్నారిని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆస్పత్రికి పంపించేందుకు నడుం బిగించింది. తను సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టింది. పొలాండ్‌ అబ్కా పొల్స్‌క కన్వీనియెన్స్‌ స్టోర్‌ కంపెనీ 1,25,000 డాలర్లకు ఆ పతకాన్ని దక్కించుకొంది.

ఆ అథ్లెట్‌ బంగారు హృదయాన్ని గౌరవిస్తూ ఆ కంపెనీ ఉదారత ప్రదర్శించింది. వేలంలో గెలిచిన ఆ రజత పతకాన్ని తిరిగి ఆమెకే ఇచ్చేసింది. పసిహృదయానికి అవసరమైన డబ్బును ఇస్తామని వెల్లడించింది. ‘ఇది నా మొదటి విరాళాల సేకరణ. పతకం వేలం వేయడమే సరైందని నాకనిపించింది. ఆ పసివాడు ఇప్పటికే చికిత్స కోసం బయల్దేరాడు’ అని మరియా తెలిపింది. కాగా, ఆ పసివాడి పేరు మిలోస్‌జెక్‌ అని తెలిసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని