Tokyo Olympics: ‘ఆమె’ గెలవకున్నా చరిత్ర సృష్టించింది

క్రీడాకారులు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే ఆశతో జీవిస్తారు. విశ్వవేదికపై పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని భావిస్తారు. అందుకోసం ఎన్నో ఏళ్లు కఠిన శిక్షణపొంది అన్ని అడ్డంకులు దాటుకొనిఒలింపిక్స్‌...

Updated : 03 Aug 2021 16:20 IST

ఒలింపిక్స్‌లో పోటీపడిన తొలి ట్రాన్స్‌జెండర్‌ లారెల్‌ హబ్బార్డ్‌

టోక్యో: క్రీడాకారులు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే ఆశిస్తారు. విశ్వవేదికపై పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని భావిస్తారు. అందుకోసం ఎన్నో ఏళ్లు కఠిన శిక్షణపొంది అన్ని అడ్డంకులు దాటుకొనిఒలింపిక్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంటారు. ఈ క్రమంలోనే అక్కడ విజేతగా నిలిస్తే ఏదో ఒక పతకంతో తిరిగొస్తారు. దాంతో వాళ్ల అభిమానులు, ఆ దేశ ప్రజలు గర్వంతో ఉప్పొంగిపోతారు. అలాంటి వారికి తగినంత గుర్తింపు కూడా దక్కుతుంది. అయితే, ఇదంతా సహజంగా పోటీపడాలనుకునే ఆడ, మగవారికి మాత్రమే ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పద్ధతి. కానీ, 2020 టోక్యో ఒలింపిక్స్‌ కొత్త సంప్రదాయానికి తెరదీసింది. అదే ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రవేశం కల్పించడం.

నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో న్యూజిలాండ్‌కు చెందిన లారెల్‌ హబ్బార్డ్‌ అనే మహిళా ట్రాన్స్‌జెండర్‌.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన మహిళల 87+ కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పోటీపడి ఓడిపోయింది. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమవడంతో ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది. కాగా, విశ్వక్రీడల్లో ఆమె ఓడిపోయినా కొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో పోటీపడిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు నెలకొల్పడమే కాకుండా తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తన ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తాను ఎప్పటికీ తనలాగే ఉండాలనుకుంటోందని చెప్పింది. ట్రాన్స్‌జెండర్‌గా ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినందుకు ఆనందం పంచుకుంది.

అయితే, ఒలింపిక్స్‌లో హబ్బార్డ్‌ పాల్గొనడంపై పలు మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. ఆమెకు అసహజమైన శారీరక బలముందని, ఆమెను పోటీల్లో నిలబెడితే మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, అవేమీ పట్టించుకోకుండా హబ్బార్డ్‌ తన పని తాను చేసుకుపోయింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో పోటీచేయడంపై స్పందించిన హబ్బార్డ్‌.. ఆ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పింది. కానీ, విశ్వక్రీడల్లో తనకు అవకాశమిచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐఓసీ)కి కృతజ్ఞతలు తెలియజేసింది. ఐఓసీ తన విలువలకు కట్టుబడి పనిచేసిందని కొనియాడింది. క్రీడలనేవి ప్రతి ఒక్కరికీ సంబంధించినవి అని అభిప్రాయపడింది. కాగా, ఈ న్యూజిలాండ్‌ ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్‌ 35 ఏళ్ల వయసులో లింగమార్పిడి చేయించుకుంది. అనంతరం వెయిట్‌లిఫ్టింగ్‌పై దృష్టిసారించి అందులో శిక్షణపొందింది. చివరికి ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించాలని ఐఓసీ గతంలోనే నిర్ణయించడంతో ఆమె ఈ పోటీల్లో పాల్గొనింది. కాగా, హబ్బార్డ్‌ ఓటమిపాలవ్వడమే కాస్త నిరాశపర్చింది. కానీ, ఆమె 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం సాధించింది. ఆపై 2019 ఓషినియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని