Sundar Singh Gurjar: 2016లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: సుందర్‌ సింగ్‌ గుర్జార్

ఇటీవల టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఎఫ్‌46 విభాగంలో కాంస్య పతకం సాధించిన సుందర్‌ సింగ్‌ గుర్జార్‌.. 2016 రియో పారాలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైనప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తాజాగా...

Published : 07 Sep 2021 00:05 IST

దిల్లీ: ఇటీవల టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఎఫ్‌46 విభాగంలో కాంస్య పతకం సాధించిన సుందర్‌సింగ్‌ గుర్జార్‌.. 2016 రియో పారాలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైనప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అప్పుడు తన కోచ్‌ మహావీర్‌ సైని ఆ పరిస్థితిని అర్థం చేసుకొని అండగా నిలిచాడన్నాడు. అలా తాను ఆ కఠిన పరిస్థితుల నుంచి బయటపడ్డానన్నాడు. సుందర్‌ 2015 వరకు సాధారణ అథ్లెట్లలాగే ఉన్నాడు. అయితే, అప్పుడు అనుకోకుండా ఒకసారి తన మిత్రుడి ఇంటికి వెళ్లిన సందర్భంలో ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఓ రేకు షెడ్డు అతడి ఎడమచేతిపై పడటంతో దాన్ని కోల్పోయాడు.

అనంతరం పారా అథ్లెట్‌గా మారిన సుందర్‌ మరుసటి ఏడాది జరిగిన రియో పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. కానీ, అతడి జీవితంలో దురదృష్టం రెండోసారి వెంటాడింది. పారాలింపిక్స్‌కు వెళ్లిన అతడు జావెలిన్‌ త్రో విభాగంలో మంచి ప్రదర్శన చేస్తున్నా నిర్వాహకులు కాల్‌రూమ్‌కు పిలిచినప్పుడు 52 సెకన్లు ఆలస్యంగా వెళ్లినట్లు పేర్కొన్నాడు. దీంతో తనని అనర్హుడిగా ప్రకటించారన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను నిరాశకు గురయ్యానని, జీవితంలో ఏమీ సాధించలేననే నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని సుందర్‌ తెలిపాడు. ఆ సమయంలో తన కోచ్‌ గమనించి.. నెలరోజుల పాటు తన వద్దే ఉంటూ కంటికి రెప్పలా తనని చూసుకున్నాడని చెప్పాడు. దాంతో తన ఆలోచనల్లో మార్పు వచ్చిందన్నాడు. అనంతరం తన ఆటపై శ్రద్ధ చూపినట్లు వెల్లడించాడు.

‘2016 రియో పారాలింపిక్స్‌లో నేను అద్భుత ప్రదర్శన చేస్తూ మా విభాగంలో టాప్‌లో నిలిచాను. అయితే, కాల్‌రూమ్‌కు పిలిచినప్పుడు 52 సెకన్లు ఆలస్యంగా వెళ్లడంతో నన్ను అనర్హుడిగా ప్రకటించారు. అప్పుడు నా గుండెపగిలినంత పనైంది. నిరాశలో మునిపోయా, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. నా కోచ్‌ గమనించి అండగా నిలిచాడు’ అని సుందర్‌ పేర్కొన్నాడు. మరోవైపు 2009 నుంచి తాను క్రీడల్లో పాల్గొంటున్నానని, తొలుత షాట్‌పుట్‌లో జాతీయస్థాయిలో పతకాలు సాధించానని చెప్పాడు. తర్వాత మహావీర్‌ సైని తనని చూసి.. కెరీర్‌లో రాణించాలంటే షాట్‌పుట్‌ వదిలి జావెలిన్‌ త్రోలో ప్రవేశించాలని సూచించాడని సుందర్‌ వివరించాడు. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, తాజా పారాలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు.. ఎఫ్‌46 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. 64.01 మీటర్ల దూరం జావెలిన్‌ త్రో చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలోనే కాంస్య పతకంతో మెరిసి తనలాంటి పారా అథ్లెట్లు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని