
Tokyo Paralympics: షూటింగ్‌లో నిరాశ.. బ్యాడ్మింటన్‌లో విజయాలు.. అరుణకు గాయాలు
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత జైత్రయాత్రకు స్వల్ప విరామం ఏర్పడింది! వరుసగా రెండో రోజు టీమ్‌ఇండియాకు పతకాలేమీ లభించలేదు. షూటింగ్‌లో రాహుల్, ఆకాశ్ విఫలమయ్యారు. బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచుల్లో ఈ రోజంతా విజయాలే లభించాయి. తైక్వాండో క్రీడాకారిణి అరుణకు గాయాలవ్వడంతో రెపిచేజ్ క్వార్టర్స్ నుంచి తప్పుకొంది.
షూటింగ్‌లో 5
భారత షూటర్ రాహుల్ జఖార్ పీ3 మిక్స్‌డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో విఫలమయ్యాడు. ఫైనల్లో 35 ఏళ్ల రాహుల్ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఏడో సిరీసు ముగియగానే నిష్క్రమించాడు. ర్యాపిడ్ దశలో 292, ప్రిసెషన్‌లో 284 మొత్తం 576 స్కోరు సాధించాడు. అంతర్జాతీయ వేదికల్లో అతడికిదే అత్యుత్తమ స్కోరు కావడం గమనార్హం. మరో భారతీయుడు ఆకాశ్ అర్హత పోటీల్లో 20వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేదు. అతడు ప్రిసెషన్‌లో 278, ర్యాపిడ్‌లో 273 మొత్తం 551 స్కోరు సాధించాడు.
బ్యాడ్మింటన్‌లో అదుర్స్
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో సుహాస్ యతిరాజ్, తరుణ్ ధిల్లాన్, కృష్ణ నాగర్ తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. జర్మనీ ఆటగాడు జాన్ నిక్లాస్ పాట్‌పై సుహాస్ 21-9, 21-3 తేడాతో 19 నిమిషాల్లో ఘన విజయం సాధించాడు. థాయ్‌లాండ్ షట్లర్ సిరిపాంగ్ టీమరోమ్‌పై తరుణ్ 21-7, 21-13 తేడాతో గెలిచాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన కృష్ణ 22-20, 21-10 తేడాతో మలేసియాకు చెందిన టారెసోహ్ డిడిన్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పలక్ కోహ్లీ విజయం అందుకొంది. టర్కీ అమ్మాయి జెహ్రా బగ్లర్‌ను 21-12, 21-18 తేడాతో ఓడించింది.
అరుణకు గాయాలు
తైక్వాండోలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అథ్లెట్ అరుణ తీవ్రంగా గాయపడటంతో రెపిచేజ్ క్వార్టర్స్ నుంచి తప్పుకొంది. కే44-49 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో ఆమె పెరూ అమ్మాయి ఎస్పినోజాతో తలపడింది. ప్రత్యర్థి ఆధిపత్యం చలాయించడంతో 21-84 తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడు రౌండ్లలో 26-2, 30-10, 28-9 తేడాతో వెనకబడింది. ఆమె కుడి పాదం, ఎడమచేతి ఎముకల్లో స్వల్ప చీలికలు వచ్చినట్టు తెలిసింది.
సెమీస్‌కు ప్రాచీ
మహిళల సింగిల్స్ 200 మీటర్ల కెనోయ్ స్ప్రింట్‌లో భారత అమ్మాయి ప్రాచీ యాదవ్ సెమీస్‌కు చేరుకుంది. వీఎల్ హీట్ 1ను ఆమె ఒక నిమిషం 11.098 సెకన్లలో పూర్తి చేసింది. స్ప్రింట్‌లో అగ్రస్థానంలో నిలిచిన బ్రిటన్ అమ్మాయి ఎమ్మా విగ్స్ (58.084 సెకన్లు)తో పోలిస్తే కేవలం 13.014 సెకన్లే వెనకబడింది. శుక్రవారం ఆమె సెమీస్‌లో అదృష్టం పరీక్షించుకోనుంది.