Tokyo Paralympics: డిస్కస్‌త్రోలో వినోద్‌ కుమార్‌కు దక్కని కాంస్యం.. అనర్హుడిగా ప్రకటన

పారాలింపిక్స్‌ పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్‌-52 విభాగంలో ఆదివారం వినోద్‌ కుమార్‌ కాంస్య ప్రదర్శన చేసినా పతకం దక్కలేదు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో వినోద్‌ 19.91 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు...

Updated : 30 Aug 2021 16:33 IST

(Photo: Tokyo2020 for India)

టోక్యో: పారాలింపిక్స్‌ పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్‌-52 విభాగంలో ఆదివారం వినోద్‌ కుమార్‌ మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతడికి పతకం దక్కలేదు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో వినోద్‌ 19.91 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే పోలెండ్‌ అథ్లెట్‌ పయిటర్‌ కోస్‌విజ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం గెలుపొందగా క్రొయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండోర్‌ 19.98 మీటర్లతో రజతం సాధించాడు. అయితే, వినోద్‌ ఈ పోటీలకు అర్హుడు కాదని ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు ఫలితాలను నిలిపివేశారు. వినోద్‌ వర్గీకరణ ప్రక్రియను సమీక్షించి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం పరిశీలించిన నిర్వాహకులు తాజాగా అతడిని అనర్హుడిగా ప్రకటించారు. దాంతో భారత్‌ పారాలింపిక్స్‌లో ఒక పతకాన్ని కోల్పోయింది. బలహీన కండరాల శక్తి, పరిమిత కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం ఉన్నవాళ్లు ఈ ఎఫ్‌-52 వర్గీకరణ కింద పోటీపడే అవకాశం ఉంది. ఆగస్టు 22న నిర్వాహకులు ఈ వర్గీకరణ చేపట్టి ఇందులో పోటీపడే అథ్లెట్ల జాబితా రూపొందించారు. కాగా, అప్పుడు వినోద్‌ను ఎంపిక చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే అతడు ఎఫ్‌-52 డిస్కస్‌త్రో ఈవెంట్‌లో పాల్గొని మూడో స్థానంలో నిలిచాడు. దాంతో భారత్‌కు మరో పతకం ఖాయమనేలా కనిపించాడు. కానీ, తాజాగా అతడిని అనర్హుడిగా ప్రకటించడంతో చివరికి పతకం చేజిక్కించుకోలేకపోయాడు. ఇక ఇప్పటివరకు భారత్‌ ఈ పారాలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించింది. ఆదివారం వినోద్‌ను మినహాయిస్తే భవీనా పటేల్‌, నిషాద్‌ కుమార్‌ చెరో రజతం సాధించారు. అలాగే సోమవారం అవనీ లేఖరా పసిడి, యోగేశ్‌ కతునియా రజతం, దేవేంద్ర జజారియా రజతం, సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్య పతకాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని