Under -19 Asia Cup: అండర్‌ -19 ఆసియా కప్‌ మన కుర్రాళ్లదే

టీమ్‌ఇండియా కుర్రాళ్లు అదరగొట్టేశారు. వరుసగా మూడోసారి అండర్‌ -19 ఆసియా కప్‌ను..

Updated : 02 Jan 2022 19:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కుర్రాళ్లు అదరగొట్టేశారు. వరుసగా మూడోసారి అండర్‌ -19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుని సత్తా చాటారు. స్వల్ప స్కోర్లు నమోదైన ఆసియా కప్‌ తుదిపోరులో శ్రీలంకపై తొమ్మిది వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్) భారత్‌ ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 రన్స్‌ చేసింది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం టీమ్ఇండియా లక్ష్యం 102 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ హర్నూర్‌ సింగ్ (5) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ రఘువన్షి (56*), తెలుగు కుర్రాడు రషీద్ (31*) రాణించడంతో 21.3 ఓవర్లలోనే భారత్‌ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. దీంతో ఆసియా కప్‌ చరిత్రలో ఏడు సార్లు భారత్‌ గెలవగా.. ఒకసారి పాకిస్థాన్‌తో పంచుకుంది.

బౌలింగ్‌లో చెలరేగిన యువభారత్‌

శ్రీలంక బ్యాటర్లను ఏమాత్రం పుంజుకోనీయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. వరుసగా వికెట్లు పడగొడుతూ చివరి వరకు ఆధిక్యం కనబరిచారు. లంక బ్యాటర్లలో చమిందు విక్రమసింఘె 2, డానియల్‌ 6, బండారా 9, రాజపక్స 14, పవర్ 4, రానుడ 7, వెల్లలాగే 9, రవీన్ 15, యాసిరు 19, పతిరాన 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో విక్కీ 3, తంబే 2.. రాజ్‌వర్థన్‌, రవి కుమార్‌, రాజ్‌ తలో వికెట్ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని