Cricket News: భారత్‌ అయితే ఎవరూ ‘నో’ చెప్పరు.. పాకిస్థాన్‌కే ఇలా: ఖవాజా

ఇటీవల పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డులు తమ సిరీస్‌లను రద్దు చేసుకోవడంపై ఆస్ట్రేలియా బ్యా్ట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా అసంతృప్తి వ్యక్తం చేశాడు...

Published : 25 Sep 2021 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డులు తమ సిరీస్‌లను రద్దు చేసుకోవడంపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ రెండు జట్లు తీసుకున్న నిర్ణయాల వెనుక డబ్బు ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చని సందేహం వ్యక్తపరిచాడు. పాక్‌లో పుట్టిన ఉస్మాన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ భారత్‌పై విషం కక్కాడు.

‘ఆటగాళ్లకు, క్రికెట్‌ బోర్డులకు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడలేమని చెప్పడం తేలికైంది. ఎందుకంటే అది పాకిస్థాన్‌ అయినందునే. ఒకవేళ అదే స్థితిలో బంగ్లాదేశ్‌ ఉన్నా ఇలాగే చేస్తారు. కానీ, అదే స్థానంలో భారత్‌ ఉంటే.. ఎవరూ రాలేమని చెప్పడానికి ధైర్యం చేయరు. అక్కడ డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. భారత్‌ పదే పదే సిరీస్‌లు నిర్వహిస్తూ భద్రతా విషయంలో తమ దేశం మ్యాచ్‌లు ఆడటానికి అనుకూలంగా ఉందని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరూ తిరిగి వెళ్లడానికి కారణాలు చూపలేరు’ అని ఖవాజా భారత్‌పై నోరుపారేసుకున్నాడు.

అనంతరం పాకిస్థాన్‌లో సెక్యూరిటీ విషయంపై స్పందించిన అతడు.. ‘ఇక్కడ నేనెలాంటి అభద్రతా కారణాలు చూడలేదు. కొంతమంది అక్కడ ఉండటం మంచిది కాదనే అభిప్రాయాలు తప్ప. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ జరిగేటప్పుడు కూడా చాలా మందిని అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే సంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లకు ముందుతో పోలిస్తే ఇప్పుడు వంద శాతం పటిష్ఠ బందోబస్తు ఉంది’ అని ఖవాజా పేర్కొన్నాడు.

కాగా, గతవారం న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాలతో ఆ జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఇంగ్లాండ్‌ కూడా అక్టోబర్‌లో వెళ్లాల్సిన పాక్‌ పర్యటనలను రద్దు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని