Virat Kohli: కోహ్లీ వెంటనే సచిన్‌కు ఫోన్‌ చేయాలి.. ఆందోళనలో సన్నీ!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వెంటనే సచిన్‌ తెందూల్కర్‌కు ఫోన్‌ చేయాలని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అంటున్నారు....

Published : 27 Aug 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వెంటనే సచిన్‌ తెందూల్కర్‌కు ఫోన్‌ చేయాలని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అంటున్నారు. తన బ్యాటింగ్‌ సాంకేతిక సమస్యకు పరిష్కారం అడిగితే మేలని సూచించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల ఐదు, ఆరు, ఏడో స్టంప్‌ లైన్‌లో అతడు ఔటవ్వడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించాడు. మూడో టెస్టు తొలి రోజు తర్వాత ఆయన మాట్లాడారు.

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేలవంగా ఆడుతోంది. బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ చేరడంతో కేవలం 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఈ మ్యాచులోనైనా భారీ స్కోరు చేస్తాడని ఆశించిన విరాట్‌ కోహ్లీ 7 పరుగులే చేసి అండర్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టెస్టు కెరీర్లో అతడు జిమ్మీకి వికెట్‌ ఇవ్వడం ఇది ఏడో సారి. గతంలో నేథన్‌ లైయన్ బౌలింగ్‌లోనూ ఏడుసార్లు ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ నాలుగు, ఐదో స్టంప్‌లైన్‌లో వెళ్తున్న బంతులకు అతడు ఔటవుతుండటం గమనార్హం.

‘విరాట్‌ కోహ్లీ వెంటనే సచిన్‌ తెందూల్కర్‌కు ఫోన్‌ చేయాలి. ఏం చేస్తే మంచిదో అతడిని అడగాలి. నాకిది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అతడు ఐదు, ఆరు, ఏడో స్టంప్‌లైన్‌ బంతులకు ఔటవుతున్నాడు. 2014లో అతడు కేవలం ఆఫ్‌స్టంప్‌ మీదుగా వెళ్లే బంతులకు మాత్రమే ఔటయ్యేవాడు’ అని సన్నీ అన్నాడు.

2003-04లో సిడ్నీ టెస్టులో సచిన్‌ అనుసరించిన విధానాన్నే కోహ్లీ పాటిస్తే మేలని సన్నీ అభిప్రాయపడుతున్నాడు. ‘సిడ్నీ టెస్టులో సచిన్‌ ఏం చేశాడో విరాట్‌ దానినే అనుసరిస్తే మంచిది. నేనిక కవర్‌డ్రైవ్‌ ఆడబోను అని తనకు తానే చెప్పుకోవాలి’ అని పేర్కొన్నాడు. అవుట్‌ స్వింగయ్యే బంతులకు బహుశా ఇలా చేయడమే మంచిదని అభిమానులూ కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు