
Virat Kohli: ఒత్తిడికి లోనయ్యాము.. ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ కుప్పకూలడం సాధారణం: కోహ్లీ
లీడ్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరుబోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురిచేశాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శనివారం ఆతిథ్య జట్టు చేతిలో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. నాలుగో రోజు తమ బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తమని తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత భారీ స్కోర్ సాధించినప్పుడు వెనుకబడిపోయామని అర్థమైందని కోహ్లీ చెప్పాడు. నాలుగో రోజు ఉదయం ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా చెలరేగారని, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తెచ్చారని అన్నాడు. ఈ క్రమంలోనే తాము కూడా సరైన రీతిలో ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. అయితే, ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని భారత సారథి పేర్కొన్నాడు.
బ్యాటింగ్ చేసేందుకు ఈ పిచ్ అనుకూలంగా ఉందని, కానీ ఇంగ్లాండ్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో తాము తప్పులు చేశామని స్పష్టంచేశాడు. అలాగే తమ బ్యాటింగ్‌లోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయామని కోహ్లీ చెప్పాడు. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని వివరించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో ఆడారని, ఈ విజయానికి వారు అర్హులని అభిప్రాయపడ్డాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి స్కోర్లు సాధించాలని, దాంతో లోయర్ ఆర్డర్ పని తేలికవుతుందని కోహ్లీ వెల్లడించాడు. ప్రతిసారీ టెయిలెండర్లు పరుగులు చేయలేరని వివరించాడు. ఇక రెండో స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పిచ్‌పై ఆధారపడి ఉంటుందని, దాని గురించి తర్వాత ఆలోచిస్తామని భారత సారథి చెప్పుకొచ్చాడు. తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.