Virat Kohli: ఆ నమ్మకంతో బరిలో దిగాం.. గెలిచాం: కోహ్లీ

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో చివరిరోజు పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అన్నాడు....

Updated : 07 Sep 2021 08:12 IST

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో చివరిరోజు పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అన్నాడు. సోమవారం మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లీసేన విజయానికి పది వికెట్లు అవసరం కాగా ఇంగ్లాండ్‌ గెలుపునకు 291 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చివరికి ఆతిథ్య జట్టు 210 పరుగులకు ఆలౌటై మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించినా చివరికి ఆ జట్టు ఓటమి పరాభవం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.

‘‘మేం గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు పట్టుదల చూపించారు. గెలవాలనే కసితో ఆడారు. ఈ మ్యాచ్‌లో మేం డ్రా కోసం ప్రయత్నించలేదు. గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ఆటగాళ్ల కృషి, పట్టుదలకు గర్వపడుతున్నా. అలాగే ఈ జట్టులోని ముగ్గురు టాప్‌ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్‌గాను ఎంతో సంబరపడుతున్నా. ఇక ఈ మ్యాచ్‌లో వాతావరణం వేడిగా ఉండటంతో మేం గెలిచే అవకాశం ఉందని ముందే అనుకున్నాం. ఈ క్రమంలోనే బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, జడేజా మాయచేశారు. ముఖ్యంగా బంతి రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉందని తెలియగానే బుమ్రా బంతి ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి బంతి ఇవ్వగానే రెండు (ఓలీపోప్‌, బెయిర్‌స్టో) కీలక వికెట్లు తీశాడు. ఇక రోహిత్‌, శార్దూల్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా శార్దూల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెరిశాడు. అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడి రెండు అర్ధశతకాలు ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాయి. అయితే, ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. అయినా, ఈ విజయాన్ని చూసి ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లంతా సంతోషిస్తారు. ఈ గెలుపు రాబోయే మ్యాచ్‌లో మాకు ప్రేరణగా నిలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇక మా గురించి బయట ఎవరేమునుకున్నా పట్టించుకోం. ఏ నిర్ణయమైనా జట్టంతా కలిసే తీసుకుంటాం’’ అని కోహ్లీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని