Published : 01 Jan 2022 01:35 IST

Virat Kohli: ఒకప్పటి కీలకాస్త్రమే కోహ్లీకి బూమ‘రాంగ్‌’ అయ్యిందా?

ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అతగాడికదే ఒకప్పుడు కీలకాస్త్రం. బౌలర్‌ ఎవరైనా, జట్టు ఏదైనా ఆ షాట్‌ సంధిస్తే బంతి బౌండరీకి పరుగులు పెట్టాల్సిందే. ఒకప్పటి అదే అస్త్రం.. ఇప్పుడు అతగాడి పాలిట శాపంగా మారింది. ఏ షాట్‌ పేరు తెచ్చిందో.. ఇప్పుడదే షాట్ విమర్శల పాల్జేస్తోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ షాట్‌ పేరు కవర్‌ డ్రైవర్‌. ఆ క్రికెటరే విరాట్ కోహ్లీ. 

ఓ అంతర్జాతీయ ఆటగాడు.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌గా పేరుగాంచిన క్రికెటర్‌.. పరుగుల రారాజుగా కీర్తి గాంచిన ప్లేయర్‌ వరుసగా రెండేళ్లపాటు ఏ ఫార్మాట్‌లోనూ శతకం చేయలేదంటే మీరు నమ్మగలరా..? టాప్‌ క్లాస్‌ బ్యాటర్‌ అయి ఉండి పదే పదే ఒకే విధమైన షాట్ ఆడి పెవిలియన్‌కు చేరతాడని  అసలు ఊహించగలమా..? ఓ వైపు కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శిస్తున్న కోహ్లీ.. బ్యాటర్‌గా మాత్రం తేలిపోతున్నాడు. కారణం అదే షాట్‌!!

2020: మూడు టెస్టుల్లో 116 రన్స్‌.. 74 వ్యక్తిగత అత్యధిక స్కోరు 
2021 ఏడాది: 11 టెస్టుల్లో 72 అత్యధిక స్కోరుతో మొత్తంగా 536 పరుగులు 

ఇవీ విరాట్ కోహ్లీ గణాంకాలు. రెండేళ్ల ముందు వరకు కోహ్లీ క్రీజులో ఉంటే అరవీర భయంకర బౌలర్‌ అయినా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిందే. ఎంతటి లక్ష్యమైనా కరిగిపోవాల్సిందే. అయితే గతేడాది నుంచి ఇప్పటి వరకు గణాంకాలు చూస్తే ఇవి అసలు కోహ్లీవేనా? అనే అనుమానం రాకమానదు. అభిమానులను నిరాశపరిచే అంశం ఏంటంటే.. ఒకప్పుడు కవర్‌ డ్రైవ్‌లను కొట్టడంలో సచిన్‌ అంతటి పేరు సంపాదించిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అటువంటి షాట్‌లకే బలి కావడం గమనార్హం.

కవర్‌డ్రైవ్‌ షాట్‌కే ఔట్‌ 

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌నే తీసుకుంటే.. ఫ్రీడమ్‌ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టు (డిసెంబర్‌ 26-30)లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. అయితే సారథి విరాట్ కోహ్లీ (35, 18) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించి కోహ్లీపై ఒత్తిడి లేకుండా చేసినా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడి మరీ ఔట్‌ కావడం దారుణంగా ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇలా మరో ఎనిమిది సార్లు సైతం వరుసగా కవర్‌డ్రైవ్‌ షాట్‌ ఆడుతూ కోహ్లీ ఔటయ్యాడు. ఈ విషయంలో సచిన్‌ సలహాలను తీసుకోవాలని పలువురు కోహ్లీకి సూచిస్తున్నారు. అయితే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కవర్‌ డ్రైవ్‌ షాట్‌తో ఎన్నో పరుగులు చేశాడని గుర్తుచేశారు.

మరి ఎందుకిలా...?

టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్‌ చెప్పినట్లు ఒకప్పుడు విరాట్ కోహ్లీ కవర్‌ డ్రైవ్‌ ఆడితే తిరుగుండేది కాదు. అంత పర్‌ఫెక్ట్‌గా కొట్టేవాడు. మరి ఇప్పుడు ఎందుకిలా.? దీనంతటికీ కారణం ఒత్తిడేనని చెప్పే విశ్లేషకులూ లేకపోలేదు. బయోబబుల్‌లో ఆడటం కూడా సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పాత్రను నిర్వహించడం కూడా అంత సులభమేమీ కాదు. టెస్టులు, వన్డేలు, టీ20ల కోసం ఎప్పటికప్పుడూ పదునైన వ్యూహాలు రచిస్తూ ఉండాలి. వాటిని మైదానంలో అమలుపరిచే వరకు సారథిపై భారం తప్పదు. ఈ క్రమంలో బ్యాటింగ్‌పై పూర్తిస్థాయి దృష్టిసారించలేని పరిస్థితి. అందుకేనేమో మొన్నటి టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికేశాడు. సెలెక్షన్‌ కమిటీ మరో అడుగు ముందుకేసి విరాట్‌ను వన్డే సారథ్యం నుంచీ తొలగించింది. అయితే ఇది ఇప్పుడు కాస్త వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది టెస్టు జట్టు నాయకత్వం. మరి ఇప్పుడు దీనిని నిలబెట్టుకుంటాడో.. లేకపోతే దీనిని కూడా వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌ మీద దృష్టి పెడతాడో వేచి చూడాల్సిందే.

రూట్‌, కేన్‌ విలియమ్సన్ మాదిరిగా రాణించాలి

ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి జో రూట్‌. కెప్టెన్‌గా సిరీస్‌ల వైఫల్యం పక్కనపెడితే వ్యక్తిగతంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 15 టెస్టుల్లో 1,708 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 228. అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌. మరోవైపు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ఆడే ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్‌ ముందుంటాడు. వరుసగా మూడేళ్ల నుంచి డబుల్ సెంచరీ సాధిస్తున్న కేన్‌ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత నిలకడైన ఆటగాడు. ఈ ఏడాది నాలుగు టెస్టుల్లో 395 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 238 నాటౌట్‌. ప్రస్తుతం కివీస్‌ తరఫున అన్ని ఫార్మాట్లకు విలియమ్సన్‌ సారథి. అయితే జట్టును నడపడంతోపాటు వ్యక్తిగతంగా పరుగులు సాధించే క్రమంలో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. రూట్, కేన్.. జట్టు సురక్షిత పరిస్థితుల్లో ఉన్నా సరే ఔట్ అయ్యేందుకు ఇష్టపడరు. వీరిని పెవిలియన్‌కు చేర్చాలంటే ప్రత్యర్థులు ఎంతో ఓపిగ్గా నిరీక్షించాలి. అయితే విరాట్‌ కోహ్లీ కూడా వీరికంటే ఎంతో మెరుగైన బ్యాటర్‌ అని ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాడు. అయితే గత రెండేళ్ల నుంచి మాత్రం ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు.

2022లోనైనా.. 

కోహ్లీకి ఇప్పుడు వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు లేవు. ఉన్నది టెస్టు కెప్టెన్సీనే. ఇకనైనా బ్యాటింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించి లోపాలను సరిదిద్దుకోవాలని క్రీడా పండితులు సూచిస్తున్నారు. ప్రతిభపరంగా విరాట్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. అమ్ముల పొదిలో కీలకమైన తన అస్త్రంపై కాస్త శ్రద్ధ పెట్టాలి. కవర్‌ డ్రైవ్‌ను ఆడేటప్పుడు బ్యాట్‌కు కనెక్ట్‌ అయ్యేలా చూసుకోవాలి. దీని కోసం మరింత కసరత్తు చేయాలి. లేకపోతే ఇదే అలవాటుగా మారి.. బలం కాస్త బలహీనతగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అలానే విమర్శకుల నోటికి పని కల్పించినట్లు అవుతుంది. 2022లోనైనా ఇలాంటి తప్పులకు కోహ్లీ చెక్‌ పెడతాడని ఆశిద్దాం!

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని