Virat Kohli: ఈ సిరీస్‌తో మళ్లీ పాత కోహ్లీని చూస్తాం: రాజ్‌కుమార్ శర్మ

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ గత రెండేళ్లుగా సరైన ప్రదర్శన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌లో మళ్లీ...

Published : 27 Dec 2021 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ గత రెండేళ్లుగా సరైన ప్రదర్శన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌లో మళ్లీ రాణిస్తాడని తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం టీమ్‌ఇండియా సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు (బాక్సింగ్‌ డే మ్యాచ్‌) ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రాజ్‌కుమార్‌.. తన శిష్యుడిపై నమ్మకంతో ఉన్నాడు.

‘గత పర్యటనలో ఇదే వేదికపై కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడూ అలాగే ఆడతాడని ఆశిస్తున్నా. అతడు ఇంతకుముందులా ఆడాలని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అతడెంతో పరిణతి కలిగిన ఆటగాడు. ఎంతో కాలంగా టీమ్ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాగే జట్టు విజయాల కోసం కట్టుబడి ఉన్నాడు. దీంతో అభిమానులు ఈసారి తనలోని పాత కోహ్లీని చూస్తారు’ అని రాజ్‌కుమార్‌ చెప్పాడు.

ఇక తుది జట్టులో రహానె, పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌లలో.. ఎవరిని తీసుకోవాలనేది పెద్ద తలనొప్పి అని ఆయన అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రంలోనే శతకం బాది అయ్యర్‌ తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. దీంతో సీనియర్లకు ఇది తలనొప్పిగా మారనుంది. కానీ, తొలి టెస్టులో ఎవరెవరితో బరిలోకి దిగుతారో ఎదురుచూడటం ఆసక్తిగా ఉంటుంది. అలాగే టీమ్‌ఇండియా ఈ సిరీస్‌ కైవసం చేసుకునేందుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకెప్పుడూ దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌ నెగ్గలేదు. ఇప్పుడు కూడా ఆ జట్టు బౌలింగ్‌ దళం బలంగా ఉంది. ఇది కష్టతరమైందే అయినా టీమ్‌ఇండియా సిరీస్‌ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నా’ అని కోహ్లీ చిన్ననాటి కోచ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని