Virat Kohli: కోహ్లీ దేనికీ ఆశపడడు..ఒక్కసారి బరిలోకి దిగితే అన్నీమర్చిపోతాడు..

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ దేనికీ ఆశపడడని, ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ అన్నారు. కొద్దిరోజులుగా భారత క్రికెట్‌లో కోహ్లీకి, బీసీసీఐకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే...

Published : 18 Dec 2021 11:06 IST

విరాట్‌ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ దేనికీ ఆశపడడని.. ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ అన్నారు. కొద్దిరోజులుగా భారత క్రికెట్‌లో కోహ్లీకి, బీసీసీఐకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇరు పక్షాల మధ్య భిన్న స్వరాలు వినిపించడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ చిన్ననాటి కోచ్‌.. విరాట్‌ ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని చెప్పారు. అతడు అంకితభావంతో క్రికెట్‌ ఆడతాడని స్పష్టం చేశారు.

‘ఈ వివాదం కోహ్లీ బుర్రలో ఎక్కడో ఓ మూలన ఉంటుంది. కానీ, ఒక్కసారి బరిలోకి దిగితే అవన్నీ మర్చిపోతాడు. అయితే, ఇదంతా అతడి ఆటను దెబ్బతీస్తుందని నేను అనుకోను. అతడికి అమితమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం కూడా ఉంది. మరోవైపు ఏ ఆటగాడికైనా ఇలాంటి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ.. బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. ఇలాంటి అనవసర రద్ధాంతం టీమ్‌ఇండియాలో ఉండకూడదని నేను అనుకుంటున్నా’ అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

అలాగే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన రాజ్‌కుమార్‌.. కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో వారి మధ్య సమన్వయలోపం లేకుండా ఉండాల్సిందని అన్నారు. అసలేం జరిగిందనే విషయంపై ఇరువురి మధ్య పారదర్శకత ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని