Cricket News: మళ్లీ బరిలోకి దిగనున్న..సెహ్వాగ్‌, యువరాజ్‌, హర్భజన్‌

టీమ్‌ఇండియా దిగ్గజాలు, మాజీ ఛాంపియన్లు.. వీరేందర్‌ సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ మళ్లీ క్రికెట్‌ బరిలోకి దిగుతున్నారు...

Published : 04 Jan 2022 16:59 IST

త్వరలోనే ఎల్‌ఎల్‌సీ లీగ్‌ ప్రారంభం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజాలు, మాజీ ఛాంపియన్లు.. వీరేందర్‌ సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ మళ్లీ క్రికెట్‌ బరిలోకి దిగుతున్నారు. ఒమన్‌ వేదికగా ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) తొలి సీజన్‌లో ఈ ముగ్గురూ ఇండియా మహారాజా జట్టు తరఫున మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం మూడు జట్లు ఆడుతుండగా.. ‘ఆసియా లయన్స్‌’ ఒకటి, ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ జట్టు’ మరొక జట్టుగా ఉన్నాయి. దీంతో ఈ లీగ్‌లో మాజీ ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగి మునుపటిలా అభిమానులను అలరించే అవకాశం ఉంది.

ఇండియా మహారాజా జట్టులో వీరూ, యూవీ, హర్భజన్‌తో పాటు మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌, ఆర్పీసింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, నమన్‌ ఓజా, మన్‌ప్రీత్‌ గోనీ, హేమంగ్‌ బదాని, వేణుగోపాల్‌ రావు, మునాఫ్‌ పటేల్‌, సంజయ్‌ బంగర్‌, నయన్‌ మోంగియా, అమిత్‌ భండారీ ఉన్నారు. ఇక ఆసియా జట్టులో పాకిస్థాన్‌, శ్రీలంక ఆటగాళ్లు ఉన్నారు. దీనికి ‘ఆసియా లయన్స్‌’ అని పేరు పెట్టారు. అందులో షోయబ్‌ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిది, సనత్‌ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్‌, కమ్రాన్‌ అక్మల్, చమిందా వాస్‌, రోమేశ్‌ కలువిరత్న, తిలకరత్నె దిల్షాన్‌, అజార్‌ మహ్మూద్‌, ఉపుల్‌ తరంగా, మిస్బా ఉల్‌ హాక్‌, మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ యూసుఫ్‌, ఉమర్‌ గుల్‌ ఉన్నారు. ఇందులో అఫ్గానిస్థాన్‌ మాజీ సారథి అస్గర్‌ అఫ్గాన్‌ సైతం ఆడనున్నాడు. మరోవైపు ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టును ఇంకా ప్రకటించలేదు. ఈ లీగ్‌కు టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని