IND vs SA: టీమ్‌ఇండియాను ఇబ్బందిపెట్టేది అతడే: వసీమ్‌ జాఫర్

మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ కగీసో రబాడ టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 23 Dec 2021 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ కగీసో రబాడ టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. అతడు భారత బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసరగలడని చెప్పాడు. 2006లో సఫారీ పర్యటనకు వెళ్లిన జాఫర్‌ అక్కడ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అతడు.. ప్రస్తుత సిరీస్‌కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘సఫారీ జట్టుకు బలమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ యూనిట్‌ ఉంది. అయితే, గాయం కారణంగా కీలక పేసర్‌ అన్‌రిచ్‌ నోర్జే ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. కానీ, ఆ జట్టులో రబాడ ఉన్నాడు. అతడో అత్యుత్తమ బౌలర్‌. తన బౌలింగ్‌ నైపుణ్యంతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేస్తాడు. ఆ జట్టుకు అంత సామర్థ్యం ఉంది కూడా. కానీ, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంతకుముందులా వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌ లేదనేది వాస్తవం. ఏదేమైనా ఇది భారత్‌కు సవాళ్లతో కూడుకున్న పర్యటన’ అని జాఫర్‌ చెప్పుకొచ్చాడు.

అనంతరం టీమ్‌ఇండియా బౌలింగ్‌పై స్పందించిన అతడు.. మన బౌలర్లు జట్టును పోటీలో ఉంచుతారని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు టీమ్ఇండియా బౌలింగ్‌ యూనిట్‌ కూడా చాలా బలంగా ఉంది. బుమ్రా, షమి మంచి అనుభవం కలిగి ఉన్నారు. మనవాళ్లు 400కు పైగా పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నా. దీంతో మన బౌలర్లు బలంగా ఉన్నా.. బ్యాట్స్‌మెన్‌కే అసలైన పరీక్ష. వాళ్లు తగినన్ని పరుగులు సాధించాలి. అదే మనకున్న సమస్య. అయితే, 2018లో విరాట్‌ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతావాళ్లూ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే రిషభ్‌ పంత్ ఉన్నాడు. అతడు కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకున్నా మ్యాచ్‌ ఫలితాన్నే మార్చగలడు. జట్టులో మంచి ఆటగాళ్లున్నా సమష్టిగా కృషిచేయాలి’ అని జాఫర్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని