Cricket News: క్రికెట్‌లో ‘అత్యంత చెత్త రివ్యూ’ ఇదేనా..?

క్రికెట్‌లో అప్పుడప్పుడు ఆటగాళ్లు చెత్త ప్రదర్శనలు చేయడం పరిపాటే. బ్యాటింగ్‌లో ఎవరైనా చెత్త షాట్లకు ప్రయత్నించి ఔటవ్వడం.. లేదా బౌలర్లు దారుణంగా బంతులేసి విపరీతమైన పరుగులు సమర్పించుకోవడం...

Published : 05 Jan 2022 01:50 IST

బంగ్లాదేశ్‌ డీఆర్‌ఎస్‌కు నవ్వుకున్న కామెంటేటర్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడు ఆటగాళ్లు పేలవ ప్రదర్శనలు చేయడం పరిపాటే. బ్యాటింగ్‌లో ఎవరైనా అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔటవ్వడం.. లేదా బౌలర్లు దారుణంగా బంతులేసి విపరీతమైన పరుగులు సమర్పించుకోవడం లాంటివి మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. అయితే, ఎప్పుడైనా ఒక జట్టు.. క్రికెట్‌లోనే ‘అత్యంత చెత్త రివ్యూ’కు వెళ్లడం చూశారా? చూడకపోతే ఇక్కడ చూసి కాసేపు నవ్వుకోండి. సహజంగా ఎవరైనా అంపైర్‌ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రివ్యూకు వెళ్లడం మనకు తెలిసిందే. ఆ బ్యాట్స్‌మన్‌ ఔట్‌ విషయంలో కచ్చితమైన ఫలితం కోసం డీఆర్‌ఎస్‌కు వెళతారు. చాలా మటుకు అవన్నీ ఎల్బీడబ్ల్యూ విషయాల్లోనే చోటుచేసుకుంటాయి. బంతి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ విషయాల్లో లేదా ఆటగాడి బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌లో తాకిందా లేదా అనే కోణాల్లో అక్కడ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ, తాజాగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా తీసుకున్న రివ్యూనే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (37 బ్యాటింగ్‌; 101 బంతుల్లో 2x4).. 37వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా తస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పుడు అతడు ఒక యార్కర్‌ వేయగా టేలర్‌ బ్యాట్‌ను అడ్డుపెట్టి బంతిని అడ్డుకున్నాడు. దీనిపై బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నాటౌటిచ్చాడు. కొద్ది క్షణాల్లో డీఆర్‌ఎస్‌ గడువు ముగుస్తుండగా బంగ్లా కెప్టెన్‌ మొమినుల్‌ హాక్‌ రివ్యూకు వెళ్లాడు. థర్డ్‌ అంపైర్‌ రీప్లేలో పరిశీలించగా.. ఆ బంతి చాలా స్పష్టంగా బ్యాట్‌కు మధ్యలో తాకుతున్నట్లు కనిపించింది. దీంతో కామెంట్రీ చేస్తున్న వ్యాఖ్యాతలు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అలా బంతి బ్యాట్‌కు తాకుతున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇది క్రికెట్‌లోనే ‘అత్యంత చెత్త రివ్యూ’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేసి బంగ్లా జట్టును ట్రోల్‌ చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. బంగ్లా ఈ రివ్యూతో తనకున్న మూడు రివ్యూలను కోల్పోయింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ 147/5తో నిలిచింది. దీంతో ఆ జట్టు ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 458 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ నాలుగో రోజు కాస్త పట్టుదలగా ఆడింది. ఇక చివరి రోజు మ్యాచ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు