Viral Video: పెనాల్టీ షూటౌట్‌లో ఇది మరో రకం.. వైరల్‌ వీడియో

ఫుట్‌బాల్‌ గేమ్‌లో పెనాల్టీ షూటౌట్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఏదైన మ్యాచ్‌ సమయం పూర్తయినా.. ఫలితం తేలకపోయినా.. లేదా స్కోర్లు సమంగా మారి మ్యాచ్‌ టైగా మారినా...

Published : 04 Jan 2022 01:52 IST

(Viral Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ గేమ్‌లో పెనాల్టీ షూటౌట్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఏదైన మ్యాచ్‌ సమయం పూర్తయినా.. ఫలితం తేలకపోయినా.. లేదా స్కోర్లు సమంగా మారి మ్యాచ్‌ టైగా మారినా.. విజేతని తేల్చడానికి ఈ విధానం పాటిస్తారు. రెండు జట్లకూ ఐదేసి గోల్స్‌ సాధించే అవకాశం కల్పిస్తారు. దీన్నే పెనాల్టీ షూటౌట్‌ అంటారు. ఇందులో ఎవరు ఎక్కువ గోల్స్‌ సాధిస్తే వాళ్లే విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలోనే పెనాల్టీ కిక్‌లో బంతిని అడ్డుకోవడానికి ప్రత్యర్థి జట్టులో గోల్‌కీపర్‌ ఒక్కడే ఉంటాడు. అతడికి 11 మీటర్ల ముందు నుంచి ఒక ఆటగాడు పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని కిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు గోల్‌కీపర్‌ దృష్టిని మళ్లించడమే అత్యంత కీలకం. అలా చేయడంలోనే ఆయా ఆటగాళ్ల ప్రతిభ బయటపడుతుంది. ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే చూస్తుంటాం. అందులో వాళ్లు ఆరితేరి ఉంటారు. కానీ, ఇప్పుడు ఓ స్కూల్‌ స్టూడెంట్‌ అలా ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తాకొట్టించి గోల్‌ సాధించడం విశేషం.

ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దాన్ని చూసిన సాకర్‌ అభిమానులు ఇతరులకు షేర్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇది తాజాగా ఆల్‌ జపాన్‌ హైస్కూల్‌ టోర్నమెంట్‌లో రైత్సు కీజాయ్‌ ఒగాషి, కిండాయి వాకాయమా జట్ల మధ్య ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో జరిగింది. ఈ గేమ్‌లో ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లకు షూటౌట్‌ అవకాశం కల్పించారు. దీంతో రైత్సు జట్టుకు చెందిన ఓ ఆటగాడు చాలా నైపుణ్యంతో గోల్‌ సాధించాడు. తొలుత బంతిని కిక్‌ చేసేందుకు కాస్త వెనక్కి వెళ్లిన అతడు.. చాలా నెమ్మదిగా కిక్‌ చేసేందుకు వస్తున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే గోల్‌కీపర్‌ను ఏమర్చడానికి ఓ ట్రిక్‌ ప్లే చేశాడు. బంతి దగ్గరికి వెళ్లగానే దాన్ని కుడిచేతి వైపు కిక్‌ చేస్తున్నట్లు ఒకసారి తన కాళ్లను కదిలించాడు. దీంతో కీపర్‌ అటువైపే బంతిని కిక్‌ చేస్తాడేమోనని అనుకున్నాడు. ఆ వెంటనే రైత్సు ఆటగాడు బంతిని ఎడమవైపు తన్ని గోల్ సాధించాడు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు మీరూ చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని