Jasprit bumrah: మాదంతా..‘ ఎంత ఉల్లాసంగా ఉన్నామో.. ఎంత ఉత్సాహంగా ఉన్నామో’ బ్యాచ్‌

వర్తమానంలో ఉంటూ ప్రతికూల ఆలోచనలు చేయకపోవడమే టీమ్‌ఇండియా విజయాలకు కారణమని పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అంటున్నాడు. తమ జట్టెప్పుడూ సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ...

Published : 07 Sep 2021 21:56 IST

లండన్‌: వర్తమానంలో ఉంటూ ప్రతికూల ఆలోచనలు చేయకపోవడమే టీమ్‌ఇండియా విజయాలకు కారణమని పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అంటున్నాడు. తమ జట్టెప్పుడూ సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. బయటి విషయాలను పట్టించుకోమని స్పష్టం చేశాడు. నాలుగో టెస్టులో బుమ్రా తన రివర్స్‌ స్వింగ్‌తో ఆంగ్లేయులను వణికించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ మధ్యలో కోచ్‌ రవిశాస్త్రికి కరోనా రావడం జట్టుపై ప్రభావం చూపించిందా? అని అడిగిన ప్రశ్నకు ‘మేం సానుకూల అంశాలపైనే దృష్టి సారిస్తాం. మేం నియంత్రించే వాటిపైనే దృష్టి పెడతాం. వ్యక్తిగతంగా, జట్టుగా మేమంతా సంతోషంగా ఉంటాం. కుర్రాళ్లు సరదాగా ఉంటారు. అక్కర్లేని వాటి గురించి ఆలోచించరు’ అని బుమ్రా బదులిచ్చాడు.

బయట విషయాలను పట్టించుకోమని, తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 127/7తో ఉన్నప్పుడు ఆందోళన చెందలేదని బుమ్రా తెలిపాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తాజాగా ఉంది. జట్టుగా మేమేమీ నమ్మకం కోల్పోలేదు. బయట అంటున్న, రాస్తున్న వాటిని అసలు పట్టించుకోం. ఆఖరి వరకూ పోరాడాలన్నదే మాకు తెలుసు. ఎలాగైనా గెలవాలన్న వైఖరిని అలవాటు చేసుకున్నాం. మిగతా సంగతులు తర్వాత చూసుకుంటాం’ అని అతడు పేర్కొన్నాడు.

ఆఖరి రోజు ఎక్కువ సమయం ఆంగ్లేయులను ఒత్తిడిలో ఉంచాలన్నదే తన ప్రణాళిక అని బుమ్రా వివరించాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్లో ఏదీ సులభంగా రాదు. పిచ్‌ బాగున్నా సరైన ప్రాంతాల్లో బంతులేయాలి. వికెట్‌ మందకొడిగా ఉన్నా ఎక్కువ సేపు ఒత్తిడి చేయాలి. పిచ్‌ ఫ్లాట్‌గా ఉందని తొలి గంటలోనే మాకు తెలుసు. ఐనా మేం కట్టుదిట్టంగా బంతులేశాం. అదే మాకు సంతోషం’ అని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్నప్పటికీ తన దృష్టి మాత్రం ప్రస్తుత లక్ష్యాల మీదే ఉంటుందని బుమ్రా స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం టీమ్‌ఇండియాకు సేవలందించేందుకు దేహ దారుఢ్యంపై దృష్టి సారించానని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని