Ajinkya Rahane: పుజారా విషయంలోనూ అంతే..! రహానె ఫామ్‌పై ఆందోళన లేదన్న విక్రమ్‌

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెకు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అండగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచులో అతడు రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు....

Published : 06 Sep 2021 14:22 IST

లండన్‌: టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెకు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అండగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచులో అతడు రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. స్వల్ప కెరీర్లోనే శార్దూల్‌ ఠాకూర్‌ కీలక ఇన్నింగ్సులు ఆడాడని ప్రశంసించాడు. నాలుగో టెస్టు ఐదోరోజు ఆటకు ముందు ఆయన మాట్లాడాడు.

ఇంగ్లాండ్‌ సిరీసులో అజింక్య రహానె అంచనాలను అందుకోలేకపోయాడు. పేస్‌ పిచ్‌లపై మెరుగ్గా ఆడతాడని భావించినా ఇబ్బంది పడుతున్నాడు. బయటకి స్వింగ్‌ అయ్యే బంతులకే కాకుండా లోపలికి వచ్చిన వాటినీ ఆడలేకపోతున్నాడు. ఫుట్‌వర్క్‌ సైతం బాగా లేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడంతో పరుగులేమీ చేయకుండా ఔటవుతున్నాడు. అతడి బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాఠోడ్‌ అంటున్నాడు.

‘సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఒడుదొడుకులు సహజమే. కెరీర్లో అనేక దశలు ఎదురవుతాయి. కొన్నిసార్లు పరుగులేమీ చేయని దశ వస్తుంది. అలాంటప్పుడే జట్టు అండగా ఉండాలి. వీలైనంత మేరకు మద్దతు ఇవ్వాలి’ అని విక్రమ్‌ రాఠోడ్‌ తెలిపాడు. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా విషయంలోనే ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు.

‘పుజారా విషయంలోనూ మనమిది చూశాం. అతడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాం. ఇప్పుడతను పుంజుకొని కీలక ఇన్నింగ్సులు ఆడాడు. అజింక్య రహానె త్వరగా ఫామ్‌ అందుకొని బ్యాటింగ్‌ విభాగంలో కీలకమవుతాడని ఆశిస్తున్నాం. అతడి గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇంకా రాలేదని అనుకుంటున్నా’ అని రాఠోడ్‌ పేర్కొన్నాడు.

మానసికంగా లేదా టెక్నికల్‌గా రహానె ఇబ్బంది పడుతున్నాడా? అని ప్రశ్నించగా ‘మేం అత్యంత కీలకమైన సిరీసు ఆడుతున్నాం. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్‌కు కష్టంగా ఉంటాయి. అందులోనూ మేం అత్యంత కఠినంగా, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటున్నాం. అందుకే ఒక బ్యాటింగ్‌ విభాగంగా టెక్నిక్‌ గురించి ఆలోచించడం ఆఖరి వరుసలోనే ఉంటుంది’ అని విక్రమ్‌ బదులిచ్చాడు.

స్వల్ప కెరీర్లోనే శార్దూల్‌ ఠాకూర్‌ అత్యంత కీలక ఇన్నింగ్సులు ఆడాడని విక్రమ్‌ ప్రశంసించాడు. ‘ఠాకూర్‌ ఆకట్టుకున్నాడు. అతడు బ్యాటింగ్‌ చేయగలడని మనందరికీ తెలుసు. పరుగులు చేసేందుకు అతడెంతో కష్టపడతాడు. అతడి వైఖరే అతడి బలం. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అతడి  సానుకూల దృక్పథం, దేహభాష ఆకట్టుకున్నాయి. రిషభ్ పంత్‌ సైతం తన శైలికి భిన్నంగా ఆడాడు. అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాడు. పరిస్థితులకు తగినట్టు ఆడగలిగే సామర్థ్యం అతడికీ, జట్టుకు మేలు చేస్తుంది’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని