
Umesh Yadav: మా బ్యాటర్లను చూస్తుంటే.. భారీ స్కోరు చేస్తామనే నమ్మకం వస్తోంది
లండన్: ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు చేస్తుందని పేసర్ ఉమేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీసేన విజయం సాధించేందుకు ఏ మార్గాన్నీ వదలిపెట్టదని పేర్కొన్నాడు. తొలుత ఆంగ్లేయుల వికెట్లు బాగానే తీసినా మధ్యలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం దక్కలేదని వెల్లడించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
తొమ్మిది నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడిన ఉమేశ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. కీలకమైన జో రూట్, డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్‌ను పెవిలియన్ పంపించాడు. తొలుత టీమ్‌ఇండియా 191 పరుగులు చేయగా బదులుగా ఇంగ్లాండ్ 290 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50) ఆ జట్టుకు 99 పరుగుల ఆధిక్యం అందించారు. రెండో రోజు ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 43/0తో నిలిచిన సంగతి తెలిసిందే.
‘ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌లో కాస్త తేమ ఉంది. బౌన్స్ కూడా లభించింది. పైగా వాతావరణం చల్లగా ఉంది. ఇప్పుడు మా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో మేం మంచి స్కోరు చేస్తామన్నా నమ్మకం ఉంది’ అని ఉమేశ్ అన్నాడు. పిచ్ మందకొడిగా మారడంతో తాము కొన్ని పరుగులు ఎక్కువగానే ఇచ్చామని అతడు వెల్లడించాడు.
‘రెండో రోజు 40 నిమిషాల్లోనే 2 వికెట్లు తీశాం. ఆ తర్వాత బంతిపై పట్టు తగ్గింది. కేవలం ఏడెనిమిది ఓవర్లలోనే 40-45 పరుగులు ఇచ్చాం. దాంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లయ అందుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలో వారికీ తెలుసు కదా! మేం బాగానే ప్రయత్నించాం. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లేదు. వరుస బౌండరీలు బాదిన తర్వాత బ్యాట్స్‌మెన్ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. మేం కొన్ని పొరపాట్లు చేశాం. వికెట్లు తీసిన తర్వాత మరింత కట్టుదిట్టంగా బంతులు వేయాల్సింది. ఏదేమైనా మేం కొన్ని పరుగులు ఎక్కువే ఇచ్చాం’ అని ఉమేశ్ తెలిపాడు.
మ్యాచులు ఆడినా, ఆడకపోయినా ఆటగాళ్లంతా లయలో ఉండేలా కోచింగ్ బృందం దృష్టి పెడుతుందని ఉమేశ్ వివరించాడు. ‘తుది జట్టులో లేనంత మాత్రాన సాధన, శిక్షణ ఆపరు. ఎందుకంటే జట్టులో మనం భాగం. నెట్స్‌లో ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలి. బంతులు విసురుతుండాలి. అలా లయ కొనసాగుతుంది. ఏ ఆటగాడికి ఎప్పుడైనా అవకాశం రావొచ్చు. అందుకే ఫిజియోలు, శిక్షకులు, బౌలింగ్ కోచ్, సహాయబృందం కఠినంగా సాధన చేయిస్తుంటారు’ అని ఉమేశ్ వివరించాడు.