Virat Kohli: 20-30 పరుగులకు పాకులాడం.. 20 వికెట్లు తీసే బౌలర్‌నే ఎంచుకుంటాం

ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో శార్దూల్‌ ఠాకూర్‌ జట్టుకు చక్కని సమతూకం తీసుకొస్తాడని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గాయపడ్డ అతడి స్థానంలో మరో బౌలర్‌నే తీసుకుంటామని స్పష్టం చేశాడు...

Published : 12 Aug 2021 10:40 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో శార్దూల్‌ ఠాకూర్‌ జట్టుకు చక్కని సమతూకం తీసుకొస్తాడని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గాయపడ్డ అతడి స్థానంలో మరో బౌలర్‌నే తీసుకుంటామని స్పష్టం చేశాడు. 20-30 పరుగుల కోసం పాకులాడటం లేదన్నాడు. దానికి బదులు 20 వికెట్లు తీసేందుకు సాయం చేసే బౌలర్‌నే ఎంచుకుంటామని వెల్లడించాడు. రెండో టెస్టుకు ముందు అతడు మాట్లాడాడు.

కోహ్లీ మాటలను బట్టి స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మలో ఎవరికి చోటు దొరుకుతుందో చూడాలి. ‘తొలి టెస్టులో జడేజా పరుగులు చేయడం సంతోషకరం. ఇది రెండో టెస్టుకు అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దాంతో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ డెప్త్‌ మరింత పెరుగుతుంది. లోయర్‌ ఆర్డర్‌ పరుగుల భాగస్వామ్యమూ ముఖ్యమే’ అని కోహ్లీ అన్నాడు.

‘అవును, శార్దూల్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం ఉపయోగపడేదే. అయితే పుజారా, రహానె, నాతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉంది. తొలి టెస్టులో మేం పరుగులు చేయనిమాట నిజమే. ఇతర బ్యాట్స్‌మెన్‌ ముందుకొచ్చేందుకు ప్రతి మ్యాచ్‌ ఒక అవకాశంగా మారుతుంది. రోహిత్‌, కేఎల్‌ బాగా ఆడారు. అందుకే ఒక బ్యాటింగ్‌ విభాగంగా మేం బాగున్నాం. శార్దూల్‌ లేనంత మాత్రాన ఒక బ్యాటర్‌ తక్కువైనట్టేమీ కాదు’ అని కోహ్లీ తెలిపాడు.

‘జట్టుకు సమతూకం తీసుకురావడమే మాకు ముఖ్యం. శార్దూల్‌ లేనప్పుడు మేం 20 వికెట్లు తీసేందుకు తోడ్పడే మరొకరిని చూడాలి. అతడు బ్యాటుతోనూ పరుగులు చేస్తే బాగుంటుంది. పుజారా, రహానెపై మేం ఆందోళన చెందడం లేదు. వ్యక్తిగత ప్రదర్శన కాకుండా జట్టుకు వారెలా ఉపయోగపడుతున్నారనేదే ముఖ్యం. మాది అత్యుత్తమమైన బ్యాటింగ్‌ లైనప్‌. ఇక రిషభ్ పంత్‌ తన సహజశైలిలో ఆడటమే ముఖ్యం. పరిస్థితులు బాగా లేనప్పుడు చెత్త షాట్లు ఆడొద్దని అతడికి తెలుసు. అదే 50-50 అవకాశం ఉంటే అతడు చెలరేగడమే మంచిది. అతడికి జట్టు యాజమాన్యం స్పష్టమైన బాధ్యతలు అప్పగించింది’ అని విరాట్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని